ఛత్రపతి శివాజీ వీర ఖడ్గాన్ని తెచ్చేందుకు ఆ మంత్రి లండన్ వెళతాడట

Update: 2023-04-17 08:00 GMT
సెంటిమెంట్ ను రగిలించి.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకునే అవకాశాన్ని కొందరు నేతలు అస్సలు వదులుకోరు. కాస్తంత రిస్కు అయినా ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేశారు మహారాష్ట్రకు చెందిన మంత్రి సుధీర్ ముంగంటివార్.

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. మరాఠీలకు ఛత్రపతి శివాజీ పేరు చెబితే ఎంతలా ఊగిపోతారో.. వారికెంతగా పూనకాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ విషయాన్ని గుర్తించారో ఏమో కానీ తాజాగా మహారాష్ట్ర కల్చరల్ మినిస్టర్ సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 17వ శతాబ్దంలో వాడిన వీర ఖడ్గాన్ని.. పిడిబాకును వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

రాయ్ గఢ్ లో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన విశాజీ 350 పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ షురూ చేస్తారని.. దీనికి ప్రపంచమే సెల్యూట్ చేసేంత ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.

శివాజీ వినియోగించిన జగదాంబ ఖడ్గం.. వాఘ్ నఖ్ (పులిగోరులా కనిపించే బాకు) ను మరాఠీ ప్రజలు చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచేలా పశ్చిమ భారత్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అలన్ గెమ్మెల్ తో పాటు.. ఇతరులతో మాట్లాడినట్లు వెల్లడించారు.

ఇదే అంశంపై తాను చర్చలుజరిపేందుకు బ్రిటన్ వెళుతున్నట్లు ప్రకటించారు. త్వరలో నిర్వహించే శివాజీ మహారాజ్ 350వ పట్టాభిషేక మహోత్సవం నాటికి వాటిని తిరిగి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అదే జరిగితే.. మరాఠీ ప్రజలు ఏక్ నాథ్ షిండే సర్కారును ఆకాశానికి ఎత్తేయటం ఖాయం.

Similar News