సండే కూడా రిజిస్ట్రేషన్.. తాజాగా సర్కారు నిర్ణయం

Update: 2021-03-05 11:36 GMT
కీలక అంశాల విషయంలో నిర్ణయాలు సమతూకంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి అన్నట్లుగా వ్యవహరించటం ఏ మాత్రం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సందర్భాల్లో మర్చిపోతుందని చెబుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా పాలనా పరమైన నిర్ణయాల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించే విధానాలు తరచూ చర్చకు వస్తూనే ఉంటాయి. ఆ మధ్యన దాదాపు నాలుగు నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆపిన వైనం షాకింగ్ గా మారటమే కాదు.. రియల్ ఎస్టేట్ తో పాటు.. సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అనంతరం.. పెద్ద ఎత్తున ఆందోళన.. ఒత్తిళ్లు రావటంతో తాను అనుకున్న రీతిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగదన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్ వెనక్కి తగ్గి.. పాత పద్దతిని పునరుద్దరించటం తెలిసిందే. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీర్ఘకాలం పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయింది. రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం రూ.10వేల కోట్లు. ఇప్పటికే మార్చిలో ఐదు రోజులు గడిచిపోయింది. ఇప్పటివరకు వచ్చిన ఆదాయం 40 శాతం మాత్రమే. దీంతో.. మిగిలిన 60 శాతాన్ని ఎంతో కొంత రాబట్టుకోవటానికి వీలుగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం.

ఈ నెలలో మిగిలిన 25 రోజుల పాటు శనివారం..ఆదివారం అన్న తేడా లేకుండా.. సెలవుల్ని పరిగణలోకి తీసుకోకుండా రిజిస్ట్రేషన్లు చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. దీంతో.. ఈ నెలలో రిజిస్ట్రేషన్లు వారం మొత్తం జరగనున్నాయి. దీంతో అయినా రిజిస్ట్రేషన్ మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతోకొంత సమకూరుతుందని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.10వేల కోట్ల మేర ఆదాయాన్ని అంచనా వేశారు. అంతకు ముందు సంవత్సరం రూ.6147 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తే.. రూ.6671 కోట్లు వచ్చాయి.

దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్ ను తెర మీదకు తీసుకురావటం.. భవన రిజిస్ట్రేషన్ల కోసం కొత్త వెబ్ సైట్ ను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం దగ్గర దగ్గర నాలుగునెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆపేయటంతో..దీనిపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి. అందుకే.. ఉన్నంతలో ఎంతోకొంత ఆదాయాన్ని సమకూర్చుకోవటానికి శని..ఆదివారాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం తాజాగా సరికొత్త ఆదేశాల్ని జారీ చేసింది.





Tags:    

Similar News