సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎవరో తెలుసా..? టాలెంటెడే.. స్టార్ కాదు

Update: 2023-02-23 15:00 GMT
ఆడమ్ గిల్ క్రిస్ట్, వీవీఎస్ లక్ష్మణ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్.. ఒకప్పటి దక్కన్ చార్జర్స్, నేటి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్లుగా వ్యవహరించినవారు. గిల్ క్రిస్ట్, వార్నర్ జట్టుకు టైటిల్ అందించారు కూడా. వీరి లెగసీ ఎంతగానో ఉపయోగపడింది. మెంటార్ గా లక్ష్మణ్ పాత్ర కూడా కీలకం. అలాంటి జట్టుకు ఈసారి కెప్టెన్ ఎవరో తేలిపోయింది. రెండో సీజన్ లోనే కప్ కొట్టి.. మరో ఆరేళ్లు ఉత్త చేతులతోనే వెనుదిరిగింది. మళ్లీ సన్ రైజర్స్ గాడిన పడాలంటే బలమైన నాయకత్వం అవసరం. అటు ఈఏడాది జట్టు కూడా గొప్పగా లేదు. ఆ నేపథ్యంలో చూసినా కొత్త కెప్టెన్ మీద బాధ్యత ఉంటుంది.

వారిని ఢీకొట్టేలా

ముంబైకి రోహిత్, గుజరాత్ కు హార్దిక్ పాండ్యా, చెన్నైకి ధోనీ, లఖ్ నవూకు రాహుల్, రాజస్థాన్ కు శాంసన్.. ఇలా అన్ని జట్లకూ ప్రతిభాంతులైన ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నారు. వీరిలో హార్దిక్ ఇప్పటికే టీమిండియా పగ్గాలు కూడా చేపట్టాడు. రాహుల్ కెరీర్ ఒడిదొడుకుల్లో ఉన్నా.. అతడూ కెప్టెన్ స్థాయి వాడే.

ధోనీ గురించి చెప్పాల్సింది ఏముంది..? రోహిత్ ఐపీఎల్ లో ముంబైకి ఏం చేశాడో అందరికీ తెలిసిందే. అయితే, హైదరాబాద్ కు ఇప్పుడు వార్నర్ లేడు. అతడి కెరీర్ చరమాంకంలో ఉంది. విలియమ్సన్ ను ఈసారి రిటైన్ చేసుకోలేదు. టీమిండియా పేసర్ భువనేశ్వర్ మినహా.. అసలు ఈసారి జట్టులో ఉన్నవారిలో పేరున్నవారే లేరు. అలాంటప్పుడు కెప్టెన్ గా ఎవరిని ప్రకటిస్తారు? అనే ఆసక్తి నెలకొంది.

సఫారీ బ్యాట్స్ మన్ కు సారథ్యం

దేశంలో చాలా ప్రధాన నగరాలున్నప్పటికీ.. కొన్నింటికి ఐపీఎల్ జట్లు లేవు. ఆ లోటు వారికి తెలుస్తుంటుంది. కానీ, తెలుగు వారికి మాత్రం కాదు. మనమంతా మనది అని చెప్పుకొనేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట ఓ జట్టుంది. ఆరెంజ్ ఆర్మీగా పేర్కొనే సన్ రైజర్స్ కు ఈసారీ విదేశీయుడే సారథి అయ్యాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ అడైన్ మార్క్ రమ్ ను కెప్టెన్ గా నియమిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఆల్ రౌండర్ గా పేరున్నప్పటికీ.. మార్క్ క్రమ్ ప్రధానంగా బ్యాట్స్ మన్. కాగా, దక్షిణాఫ్రికా జట్టులో మార్క్ రమ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పటికైతే అతడికి శాశ్వత స్థానం లేదని చెప్పొచ్చు.

ప్రతిభావంతుడే..

28 ఏళ్ల మార్క్ రమ్ దక్షిణాఫ్రికా అండర్ 19 జట్టు సారథిగానూ వ్యవహరించాడు. 2017లో టెస్టు, వన్డే, 2019లో టి20 అరంగేట్రం చేశాడు. అయితే, తన దేశానికే చెందిన డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్ స్థాయిలో మ్యాచ్ విన్నర్ గా మాత్రం ఎదగలేకపోయాడు. కాగా , ఎస్‌ఏ20 (దక్షిణాఫ్రికా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్‌ టోర్నీ) లో సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన అనుబంధ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ జట్టుకు కూడా మార్‌క్రమ్‌ సారథ్యం వహించాడు. ఇటీవల ఆ టోర్నీలో మారక్రమ్‌ జట్టు విజేతగా నిలిచింది. దీంతో హైదరాబాద్‌ పగ్గాలను కూడా అతడికే అందించారు.మరోవైపు సన్‌రైజర్స్‌ జట్టుకు విదేశీ ఆటగాళ్లు నాయకత్వం వహించడం కొత్తేం కాదు. గతంలో కొన్నేళ్ల పాటు డేవిడ్‌ వార్నర్‌, ఆపై కేన్‌ విలియమ్సన్‌ నడిపించారు.

మధ్యలో కొన్ని సార్లు భువనేశ్వర్‌ కుమార్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించినా అది తాత్కాలికమే. వార్నర్‌ గత సీజన్లోనే సన్‌రైజర్స్‌ను వీడగా.. ఈ సీజన్‌కు ముందు విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ విడిచిపెట్టింది. దీంతో జట్టు కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మార్‌క్రమ్‌ లేదా టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం మార్‌క్రమ్‌కు అవకాశమిచ్చింది.           



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News