సుప్రీంకోర్టు... ఒక నమ్మలేని తీర్పు !

Update: 2023-02-21 11:05 GMT
ఇటీవ‌ల కాలంలో సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులు.. చేస్తున్న వ్యాఖ్య‌లు చాలా చిత్రంగా ఉంటున్నాయ‌ని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ తీర్పు కూడా ఇదే కోవ‌లో ఉంద‌ని చెబుతున్నారు. సాధార‌ణంగా.. ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కులు.. ఏం చ‌దువుకున్నారు?  వారికి ఉన్న నాలెడ్జ్ ఎంత‌? అని ఓటు వేసేవారు ప‌రిశీలిస్తారు. అందుకే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన టీఎన్ శేష‌న్‌.. ఈ విష‌యాన్ని కూడా నాయ‌కులు ప్ర‌జ‌ల‌తో పంచుకోవాల‌ని సూచించారు.

ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పోటీ చేసేవారు..తాము ఏం చ‌దువుకున్నారో.. ఖ‌చ్చితంగా చెప్పా ల‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఇక‌, మూడు ద‌శాబ్దాలుగా ఈ వ్య‌వ‌హారంన‌డుస్తోంది. అంటే.. ఎన్నిక‌ల‌లో పోటీ చేసే అభ్య‌ర్థులు తాము ఏం చ‌దువుకున్నామో.. ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌కుండా చెప్పాల్సి వ‌స్తోంది.

దీంతో అభ్య‌ర్థుల విద్యా ప‌రిజ్ఞానం.. వారు ఏం చ‌దువుకున్నారు? అనే ఆస‌క్తిక‌ర విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలుస్తున్నాయి. కానీ, ఈ విష‌యంలోనూ కొంద‌రు నాయ‌కులు ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌డుతూనే ఉన్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ.. ఏం చ‌దువుకున్నార‌నేది ఇప్పటికీ బ్ర‌హ్మ‌ప‌దార్థ‌మే. వారు చెప్ప‌రు.. ఎవ‌రినీ చెప్ప‌నివ్వ‌రు. అయితే.. ఇలాంటి వాటిని ఎన్నిక‌ల సంఘం నేరంగా ప‌రిగ‌ణిస్తోంది.

కానీ, ఇది ఇప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే. ఇక‌పై అలా కుద‌ర‌దు. ఎందుకంటే.. నాయ‌కుల విద్యార్హ‌త‌ల‌పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. నాయ‌కులు త‌మ విద్యార్థ‌త‌ల విష‌యంలో ఏం చెప్పినా ఫ‌ర్వాలేద‌ని.. దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది.

ఎన్నికల అఫిడవిట్‌లో విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇవ్వడం నేరమేమీ కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అభ్యర్థుల విద్యార్హతలు చూసి ఎవ‌రూ ఓటు వేయడం లేదని, అందువల్ల వీటిపై తప్పుడు వివరాలు ఇవ్వడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123(2), సెక్షన్‌ 123(4)ల కిందకు వచ్చే నేరపూరిత చర్యలుగా పరిగణించలేమని తెలిపింది.

జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. ఏదో కొద్దిగా కేరళలో తప్పించి ఇంకెక్కడా విద్యార్హతల ఆధారంగా ఓటు వేయడం లేదని ఈ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న వ్యాఖ్యానించారు.  ఇక‌, ఇంకేముంది.. నాయ‌కులు రెచ్చిపోవ‌చ్చ‌న్న మాట అంటున్నారు న్యాయ‌నిపుణులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News