స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సుప్రీం కీలక నిర్ణయం

Update: 2023-04-16 14:00 GMT
అబ్బాయి.. అమ్మాయి పెళ్లి చేసుకోవటం మామూలే. అబ్బాయిని అబ్బాయి.. అమ్మాయిని అమ్మాయి పెళ్లి చేసుకునే కొత్త ట్రెండ్ మన దేశంలో మొదలు కావటమే కాదు.. ఈ మధ్యన ఊపందుకుంటోంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ఎప్పటి నుంచో న్యాయపోరాటాలు సాగుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికి స్పష్టత రాకపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఇదిలాఉంటే.. ఈ అంశంపై కేంద్రం తన విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న అంశాన్ని వ్యతిరేకిస్తోంది. ఇలాంటి వివాహాలతో భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధంగా మారుతుందని.. వాటికి చట్టబద్దత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు.. సామాజిక విలువలు సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బ తింటోందని పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి తన వాదనలనను అఫిడవిట్ రూపంలో సమర్పించింది. దేశంలో స్వలింగ వివాహాలకుచట్టబద్ధత లేనప్పటికీ.. పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వారికి చట్టపరంగా ఎలాంటి హక్కులు లేని పరిస్థితి నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సుప్రీం నిర్ణయించింది. ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18 నుంచి విచారించనుంది. ఈ ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనంలో ఎవరెవరు ఉండనున్నారంటే..
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్
- జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్
- జస్టిస్ రవీంద్ర భట్
- జస్టిస్ హిమా కోహ్లీ
- జస్టిస్ పీఎస్ నరసింహ

ఇక.. ఈ పిటిషన్లను ప్రాథమికంగా విచారించిన సందర్భంగా రాజ్యాంగ హక్కులు.. ప్రత్యేక వివాహ చట్టం.. ప్రత్యేక శాసన చట్టాలతో ఈ కేసు ముడిపడి ఉంది. అందుకే ముగ్గురు సభ్యులున్న సుప్రీం ధర్మాసనం నుంచి ఐదుగురు సభ్యులున్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి.. ఈ సున్నిత అంశంపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు ఏ రీతిలో ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Similar News