సుప్రీం ఆర్డ‌ర్ పాటిస్తే.. దేశంలో ఫోన్లు మూగ‌బోతాయా?

Update: 2020-02-17 07:30 GMT
కొన్ని ప్ర‌ముఖ మొబైల్ నెట్ వ‌ర్క్ కంపెనీల‌కు సుప్రీం కోర్టు భారీ ఫైన్ విధించింది. అది ఏకంగా ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉందాయె. ఈ భారీ ఫైన్ ను దేశంలోని కొన్ని ప్ర‌ముఖ టెలికాం కంపెనీలు చెల్లించాల్సి ఉంది. ఆ విష‌యంలో ప‌లు సార్లు కంపెనీలు విన్న‌వించినా కోర్టు మాత్రం ఆ ఫైన్ ను చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వానికి ఆ సంస్థ‌లు ఈ ఫైన్ చెల్లించాల‌ని సుప్రీం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యం లో ఆ ఫైన్ ను చెల్లించ‌డం సాధ్య‌మేనా? అనేది సందేహంగా మారింది.

ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయ‌లు అంటే మాట‌లు కాదు, ఇదేం ఒక కంపెనీకి ప‌డ్డ ఫైన్ కాదు. వివిధ టెలికాం కంపెనీలన్నీ క‌లిసి ఈ మేర‌కు చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే.. అలా అయిన‌ప్ప‌టికీ వాటికి ఇది భార‌మేన‌ట‌. ఎంత భార‌మంటే.. ఈ ఫైన్ చెల్లిస్తే చాలు. స‌ద‌రు కంపెనీలు ఆస్తులు అన్నీ అమ్ముకోవాల్సిందే. త‌మ‌కున్న ట‌వ‌ర్లు, ఆస్తులు, ఆఫీసులు..అన్నింటినీ అమ్ముకున్నా.. ఈ ఫైన్ ను చెల్లించ‌డం క‌ష్ట‌మే అవుతుంద‌ట ఆ కంపెనీల‌కు.

అస‌లే జియో వ‌చ్చాకా టెలికాం కంపెనీల ప‌రిస్థితి తిర‌గ‌బ‌డింది. అంత‌ వ‌ర‌కూ ఒక వెలుగు వెలిగిన ఐడియా, ఎయిర్ టెల్ వంటి సంస్థ‌లే ఇక్క‌ట్లు ప‌డుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో ఇప్పుడు సుప్రీం కోర్టు విధించిన ఫైన్ ను కూడా క‌ట్టాలంటే అవ‌న్నీ మూత‌ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఈ విష‌యాన్ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అంతే కాద‌ట‌.. అవి దివాళా పిటిష‌న్లు వేస్తాయ‌ని, దీంతో వాటితో లావాదేవీలు ఉన్న బ్యాంకులకు కూడా వాటి దెబ్బ అదిరిపోయే అవ‌కాశం ఉంద‌ని బ్యాంక‌ర్లు అంటున్నారు! మ‌రి సుప్రీం కోర్టు ఈ ప‌రిస్థితి ని అర్థం చేసుకుంటుందో, లేక టెలికాం కంపెనీల‌కు త‌న షాక్ ను కొన‌సాగిస్తుందో!
Tags:    

Similar News