జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసు మరోమారు తెరమీదకు వచ్చింది. గాంధీజీ హత్యలో ఇంకా తేలాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయంటూ అభినవ భారత్ సంస్థ ట్రస్టీ డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ విజ్ఞప్తి కోర్టును ఒకింత సందిగ్దతలో పడింది. ఈ దర్యాప్తును పునఃప్రారంభించాలన్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో కోర్టు సహాయకునిగా (అమికస్ క్యూరీ) సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ ను నియమించింది. అభినవ భారత్ సంస్థ ట్రస్టీ డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబడే - ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఎప్పుడో ముగిసిపోయిన కేసును ఇప్పుడు ఎలా తిరుగదోడుతాం? సాక్షులు సజీవంగా లేరు. హంతకులకు ఉరిశిక్ష అమలైంది. ఇప్పుడు దేని ఆధారంగా మళ్లీ దర్యాప్తు జరుపుతాం? అని ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది.
1948 జనవరి 30న హిందూ జాతీయోన్మాది నాథూరాం గాడ్సే గాంధీజీని కాల్చిచంపాడు. 1949 నవంబర్ 15న గాడ్సేతోపాటు అతనికి సహకరించిన నారాయణ ఆప్టేను ఉరితీశారు. వీడీ సావర్కర్ ను సరైన సాక్ష్యాలు లేని కారణంగా విడుదల చేశారు. ఈ కేసులో కొన్ని రహస్య పత్రాలు వెలుగుచూడాల్సి ఉందని, చరిత్రలో అతిపెద్ద మసిపూత ఈ కేసులో జరిగిందని పిటిషనర్ ఫడ్నిస్ తెలిపారు. అమెరికా గూఢచార విభాగం సీఐఏ పూర్వసంస్థ గాందీజీని కాపాడేందుకు ప్రయత్నించిందా? అనేది తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పత్రాల సేకరణకు తనకు కొంత సమయం ఇవ్వాలని ఫడ్నిస్ కోర్టును వేడుకున్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ``ఈ దశలో ఏమి చేయగలం? మీకు పత్రాల సేకరణకు ఎంత సమయం అంటే అంత సమయం ఇస్తాం. కానీ నిర్ధారితమైన తీర్పును తిరుగదోడేందుకు మేం ఎందుకు అనుమతించాలో చెప్పండి`` అని పిటిషనర్ ను అడిగింది. కేసు ముగిసిపోయిన సంగతి తనకు తెలుసునని ఫడ్నిస్ అన్నారు.
1966లో ఏర్పాటైన జస్టిస్ జేఎల్ కపూర్ దర్యాప్తు కమిషన్ నివేదికను ఆయన ప్రస్తావించారు. 1949లో అపరాధులు సమర్పించిన అపీళ్లను తూర్పు పంజాబ్ హైకోర్టు కొట్టివేసిందని, మరుసటి సంవత్సరం ఏర్పాటు కానున్న సుప్రీంకోర్టు పరిశీలిస్తుందనే ఉద్దేశంతో ప్రైవీ కౌన్సిల్ ఈ కేసును వెనుకకు పంపిందని, దీనిపై ఇంతదాకా సుప్రీంకోర్టు పరిశీలన జరుగనేలేదని ఫడ్నిస్ వాదించారు. (కపూర్) నివేదికలో ఏమున్నదనేది పక్కన పెడితే సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు ధ్రువీకరించింది కదా? అని ధర్మాసనం గుర్తు చేసింది. బ్రిటిష్ స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం ఫోర్స్ 136 గాంధీజీని హత్యచేసి ఉంటుందని ఫడ్నిస్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే సంస్థల్ని తాము శిక్షించలేమని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. ``మీరు అంటున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడా?`` అని అడిగింది. ఆ సంగతి తనకు తెలియదని, నిజాన్ని నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు మాత్రం జరుగాల్సిందేనని ఫడ్నిస్ పట్టుబట్టారు.
గాడ్సే గాంధీజీపై కాల్పులు జరుపగానే ఆ పక్కనే ఉన్న అమెరికా దౌత్య కార్యాలయ అధికారి హర్బర్ట్ టామ్ రైనర్ హంతకుడిని అక్కడున్న గార్డుల సహాయంతో ఒడిసి పట్టుకున్నారని పిటిషనర్ చెప్పారు. ``ఇప్పుడు రైనర్ బతికున్నాడా?`` అని ధర్మాసనం అడిగితే ఇటీవలే మరణించారని ఫడ్నిస్ సమాధానమిచ్చారు. అలాగైతే ఇప్పుడు ఆయన తరఫున ఎవరు సాక్ష్యమిస్తారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా శరపరంపరగా ప్రశ్నలు కురిపించిన ధర్మాసనం చివరకు ఈ కేసుపై నిర్ణయం తీసుకోవడంలో సహకరించాల్సిందిగా ఆ సమయంలో కోర్టులోనే ఉన్న న్యాయవాది శరణ్ ను ఆదేశించింది. విచారణను ధర్మాసనం అక్టోబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా జాతిపిత మరణంపై ఈ కేసు ముందడుగు పడితే...మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నారు.