గృహ హింసపై సుప్రీం కీలక తీర్పు .. ఆ హక్కు వారికి కూడా ఉంటుంది !

Update: 2020-10-16 08:45 GMT
గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చేలా సుప్రీం కోర్టు  గురువారం తీర్పు వెలువరించింది. బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గృహ హింస చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. అత్తమామలు, ఆడపడుచులు లేదా ఇతర కుటుంబ సభ్యులు గానీ కోడళ్లను ఇంటి నుంచి గెంటేయడం కుదరదని స్పష్టం చేసింది. ‘వివాహమైన తర్వాత భర్తతో కలిసున్నా లేదా ఒంటరిగా ఓ ఇంట్లో ఉంటున్నపుడు అక్కడ ఉండే హక్కు ఆ మహిళకు  ఉంటుంది.

డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్‌ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం తోసిపుచ్చింది. చట్టం ప్రకారం ఒక మహిళ నివసించే హక్కును పరిరక్షించే మధ్యంతర ఉత్తర్వు ఆస్తికి సంబంధించిన సివిల్ కేసుల కిందకు రాదని పేర్కొంది. గృహ హింస చట్టం నివాస హక్కుకు సంబంధించి సెక్షన్ 19 ప్రకారం ఏదైనా సివిల్ వివాదం ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి ఆంక్షలు కాదు, ఈ చట్టం కింద విచారణలో ఇచ్చిన మధ్యంతర లేదా తుది ఉత్తర్వులకు సంబంధించినవని తెలిపింది.

ఇదే అంశంపై 2007లో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఇల్లు ఆమెది కానపుడు, సదరు ఇంట్లో ఉండే హక్కు ఆమెకు ఉండదంటూ 2007లో ద్విసభ్య ధర్మాసం తీర్పు ఇచ్చింది. సదరు ఇల్లు ఉమ్మడి కుటుంబానిదా లేక మరింకెవరిదా అన్న విషయాన్ని కేసు దాఖైలన కోర్టు లేదా కుటుంబ న్యాయస్థానం తేల్చాలి. అంతేకాదు... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం సంక్రమించిన నివాస హక్కు రద్దు చేయడానికి వీల్లేని అనివార్యమైన హక్కు కాదు. వయసుపైబడ్డ తలిదండ్రులు  తమ జీవన సాయం సంధ్యలో ఎక్కడికి పోగలరు? వారికీ ఆ ఇంట్లో ఉండే హక్కుంటుంది. కొడుకు-కోడలి మధ్య గొడవలకు వారిని బలిచేయడం సరికాదు. ఆ నివాస హక్కు ఇరువురికీ ఉంటుంది. దీన్ని సక్రమంగా సమతౌల్యత చేయాల్సిన బాధ్యత సదరు కోర్టుది’ అని బెంచ్‌ వివరించింది. సతీశ్‌చందర్‌ ఆహూజా అనే 76-ఏళ్ల వ్యక్తి వేసిన కేసుపై బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. ఢిల్లీలోని స్వగృహం పూర్తిగా తనదేనని, దానిపై తన కుమారుడికి కానీ, కోడలుకు కానీ ఎలాంటి హక్కు లేదని పేర్కొంటూ అహూజా స్థానిక కోర్టులో దావా వేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు తన భార్య నుంచి విడాకులు కోరుతూ మరో కేసు దాఖలు చేశారు. మరోవైపు, ఆయన కోడలు గృహ హింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టారు. అహూజా వేసిన కేసుని విచారించిన స్థానిక సివిల్‌ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ ఇంటినుంచి కోడలు వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనిపై ఆయన డిక్రీ తెచ్చుకున్నారు. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక క్రిమినల్‌ కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆమెను ఆ ఇంటినుంచి పంపివేయవద్దని తీర్పునిచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలనిచ్చింది.
Tags:    

Similar News