సుప్రీం సూచన నేపథ్యంలో.. ఉరిశిక్ష అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

Update: 2023-05-02 17:36 GMT
కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. మరణశిక్షను అమలు చేసే విధానంలో ఇతర పద్దతుల మీద అధ్యయనం చేయాలని చెప్పింది. సుప్రీం మాట నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష విధానం.. దానికంటే సులువైన మార్గం ఇంకేమైనా ఉంటుందా? అన్న అంశంపై అధ్యయనం చేసేందుకు వీలుగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వివరించారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం ఇప్పటికే చర్చలు మొదలుపెట్టినట్లుగా పేర్కొన్న అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి.. నిపుణుల కమిటీ ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఉరితీతకు ప్రత్యామ్నాయ పద్దతులు ఇంకేమైనా ఉన్నాయన్న దానిపై వివరాల్ని సేకరించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. సుప్రీం సూచనను కేంద్రం పరిగణలోకి తీసుకుందని.. కమిటీ సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలను అనుసరించనున్నట్లు చెప్పారు.

ఉరితీతకు ప్రత్యామ్నాయ అంశాలపై అధ్యయనానికి మరింత సమయం కావాలని కోరిన అటార్నీ జనరల్ విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. మరణశిక్షను అమలు చేసే అంశానికి సంబంధించిన రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ  న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంలో పిటిషన్ వేయటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఉరితీత చాలా పెయిన్ తో కూడిన శిక్షగా పేర్కొంటూ.. నాగరిక సమాజంలో మరణాన్ని మరింత సులువుగా ఉండే మార్గాల్ని అన్వేషించాలని కోరారు. అమెరికాలో ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా మరణశిక్షను అమలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ పద్దతితో పోలిస్తే.. ఉరిశిక్ష వేయటం అత్యంత క్రూరమైన విధానంగా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు..ఈ అంశంపై కేంద్రం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోరింది. అయితే.. తమకు మరింత సమయం కావాలని కేంద్రం కోరింది.

Similar News