జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్‌.. అమర్‌రాజాకు ఊరట!

Update: 2022-05-20 07:35 GMT
జగన్‌ ప్రభుత్వానికి తాజాగా సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ, సినీ నటుడు మహేష్‌ బాబు బావ గళ్లా జయదేవ్‌కు చెందిన అమర్‌రాజా బ్యాటరీస్‌ అనుకూలంగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అమర్‌రాజా బ్యాటరీస్‌ నుంచి కాలుష్య వ్యర్థాలు, కాలుష్య కారకాలు భూగర్భ జలాల్లో కలుస్తున్నాయని.. కాలుష్య వ్యర్థాలకు సంబంధించి అమర్‌రాజా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ జగన్‌ ప్రభుత్వం అమర్‌రాజా బ్యాటరీస్‌పై చర్యలకు ఉపక్రమించింది.

ఇందులో భాగంగా గతేడాది చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీస్‌లో అధికారులతో తనిఖీలు జరిపించింది. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, విద్యుత్‌ పంపిణీ సంస్థల అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.

అమర్‌రాజా బ్యాటరీస్‌ వల్ల పెద్ద ఎత్తున కాలుష్య కారకాలు గాలిలో కలుస్తున్నాయని.. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని జగన్‌ ప్రభుత్వం అభియోగాలు మోపింది. అలాగే వ్యర్థాలను కూడా సరిగా నిర్వహించడం లేదని.. దీంతో ఆ వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలిసి సమీప ప్రాంతాల ప్రజలకు తాగునీటిలో సమస్యలు ఏర్పడుతున్నాయని ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. అమర్‌రాజా బ్యాటరీస్‌ సంస్థకు సీలు వేయించింది.

దీనిపై అమర్‌రాజా బ్యాటరీస్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అమర్‌రాజాలో ఉల్లంఘనలు ఉంటే సరిదిద్దుకోవడానికి ఆ సంస్థకు సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత చర్యలు తీసుకోవచ్చని సూచించింది.

అయినా ఏపీ ప్రభుత్వం అమర్‌రాజాను ఇబ్బందులు పెట్టడానికే ప్రయత్నించింది. ఇది తెలుగుదేశం పార్టీకి చెందిన, కమ్మ సామాజికవర్గానికి చెందిన గళ్లా జయ్‌దేవ్‌ది కావడమే ఇందుకు కారణం. దీంతో ఒళ్లు మండిన అమర్‌రాజా సంస్థ రాష్ట్రంలో నెలకొల్పాలనుకున్న తమ కొత్త యూనిట్‌ను తమిళనాడుకు తరలించేసింది.

హైకోర్టు తీర్పుపై అమర్‌రాజా బ్యాటరీస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మే 20న స్టే విధించింది. తదుపరి విచారణ సాగి తాము తీర్పు ఇచ్చే వరకు అమర్‌రాజా బ్యాటరీస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జగన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వంతోపాటు ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలికి, విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు)కు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.
Tags:    

Similar News