సుప్రీం ట్రిపుల్ థమాకా.. ఈ రోజే మూడు కీలక తీర్పులు

Update: 2019-11-14 04:43 GMT
కొన్నేళ్లు గా పెండింగ్ లో ఉన్న కీలకమైన కేసుల కు సంబంధించిన తీర్పుల్ని ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది సుప్రీంకోర్టు. ఇటీవల 120 ఏళ్లకు పైనే సాగిన అయోధ్య వివాదం పై చారిత్రక తీర్పు ను ఇచ్చిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. సీజేఐ సైతం ఆర్టీఐ పరిధి లోకి వస్తారన్న మరో కీలక తీర్పు ను ఇవ్వటం తెలిసిందే.

సుప్రీంకోర్టు ప్రదానన్యాయమూర్తి త్వరలో రిటైర్ కానున్న నేపథ్యం లో కీలక కేసులకు సంబంధించిన తీర్పులు వరుస  పెట్టి ఇచ్చేస్తున్నారు.  నిన్న సీజేఐ ను ఆర్టీఐ పరిధి లోకి తీసుకొస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీం.. ఈ రోజు (గురువారం) మూడు కీలక అంశాలకు సంబంధించిన తీర్పుల్ని ఇవ్వనుండటం విశేషం.

ఈ మూడు అంశాలు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చను.. ఆందోళనల్ని.. నిరసనల్ని రేపినవి కావటం గమనార్హం. ఇంతకీ.. ఈ రోజు తీర్పు చెప్పనున్న మూడు తీర్పుల విషయానికి వస్తే..

1. శబరిమల వివాదం
కేరళకు చెందిన ఈ ఫేమస్ ఆలయంలోకి10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు దర్శనంపై పరిమితులు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఉన్న ఆంక్షల్ని ఎత్తి వేస్తూ2018 సెప్టెంబరులో సుప్రీం తీర్పును ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనతో పాటు.. ఈ తీర్పును సమీక్షించాలని పలువురు సుప్రీంను ఆశ్రయించారు.

దాదాపు65 వరకు పిటిషన్లు ఈ అంశంపై దాఖలు అయ్యాయి. దీని పై సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయి తో పాటు మరో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది.

2.రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు
మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ వెలుగు చూసిన ఏకైక ఆరోపణ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు మీదనే. ఈ ఒప్పందం లో  అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. దీని పై విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం 2018 డిసెంబరులో పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పు ను ఇచ్చింది. దీని పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు వ్యాజ్యాలు వేశారు. దీంతో.. ఈ రోజు ఆ పిటీషన్ల పై తీర్పు ను వెలువరించనున్నారు.

3. రఫేల్ ఇష్యూ లో మోడీ పై రాహుల్ వ్యాఖ్యలపై..
36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ ప్రధాని మోడీ మీద తీవ్రస్థాయి లో విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ సందర్భం గా ప్రధాని మోడీని చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కింద వస్తాయంటూ బీజేపీ ఎంపీ ఒకరు పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ను ఇవ్వనుంది.
Tags:    

Similar News