యుద్ధ గంటలు మోగించి నిద్రపోవడం పనికిరాదు.. గెలిచే వరకు పోరాడాలి పవన్

Update: 2022-12-02 04:29 GMT
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. అందుకే రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసింత నేర్పరితనం.. కలివిడితనం.. కలుపుగోలుతనం అవసరం.. ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్నప్పుడే వారికి నమ్మకం కలుగుతుంది.. అప్పుడే మనల్ని గెలిపిస్తారు. ఈ లాజిక్ మిస్ అవ్వుతున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ పరుషంగా ముందుకెళ్తున్నా ఆయనకు ఓట్లు పడడం లేదు..  పవన్ దెబ్బై పోతుంది ఇక్కడేనని రాజకీయ విశ్లేషకులు ఘంఠాపథంగా చెబుతున్నారు.

అమావాస్య చంద్రుడు మన జనసేనాని పవన్ కళ్యాణ్ అని రాజకీయవర్గాల్లో ఓ చెత్త ప్రచారం ఉంది. ఒక్కసారిగా నిప్పులు చెరిగి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడంటారు...  అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే కనిపించేలా పవన్ రాజకీయాలున్నాయంటున్నారు. పార్ట్ టైం పాలిటిక్స్ పవన్ కు బాగా అలవాటైపోయిందని రాజకీయాల్లో సెటైర్లు పడుతున్నాయి.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం.. నిప్పు రాజేయడం.. తర్వాత కనిపించకుండా పోవడం.. ఇప్పుడు ఇదే పవన్ పాలి'ట్రిక్స్' అని అందరూ ఎద్దేవా చేస్తున్నారు.
 
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ని వీకెండ్ యోధుడు అంటూ వైసీపీ టార్గెట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం వారాంతాల్లో మాత్రమే ఏపీకి వస్తారని, ఏదో ఒకరిపై అరుస్తూ హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ తన సినిమాల షూటింగ్‌లు చేసుకుంటారని ఆరోపిస్తోంది.

పవన్ కు రాజకీయ ప్రత్యర్థులు చేసే కామెంట్స్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ తొలిసారి సినిమా ఇండస్ట్రీ నుంచి  సీనియర్ టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పవన్‌పై క్రూరమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరియు జనసేన అధినేత గురించి ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

 "మీరు హెచ్చరిక గంటలు మోగించిన తర్వాత యుద్ధాన్ని ప్రారంభించడం చాలా ముఖ్యం. కేవలం యుద్ధ గంటలు మోగించి నిద్రపోవడం పనికిరాదు. మీరు చర్యకు దిగిన తర్వాత, మీరు గెలిచే వరకు పోరాడాలి లేదా మీరు చనిపోతారు." అని పవన్ కళ్యాణ్ తీరుపై తమ్మారెడ్డి విమర్శలు గుప్పించారు.

 పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి నిప్పులు చెరుగుతున్నారని, ఆ తర్వాత నాలుగు రోజులకు వెళ్లిపోతారని, ఇదే ఒక తంతుగా మారుతుందని తమ్మారెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ తీరుపై ఆయన వ్యాఖ్య స్పష్టంగా కనిపిస్తోంది. విచిత్రమేమిటంటే ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్‌కి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న వ్యూహాత్మక దాడికి బూస్ట్ నిచ్చేలా ఉన్నాయి. పవన్ తీరును సినిమా ఇండస్ట్రీ పెద్దలే తప్పుపడుతున్నారంటే అర్థం చేసుకోవాల్సిందే.. అనుమానించాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్యాఖ్యలు వైసీపీకి చాలా అనుకూలంగా మారాయి.

పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ తో జనసైనికుల్లో నైరాశ్యం కనిపిస్తోందంటున్నారు.. ఎన్నికలకు ముందు కూడా 10 రోజులు విస్తృతంగా ప్రచారం చేసి వార్తల్లో నిలిచి పవన్ మరో 15 రోజుల పాటు కనిపించకుండా పోయేవారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఓటమిపై రివ్యూ చేసి మన టార్గెట్ ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు పాలిటిక్స్ లో ఉండి అధికారమే లక్ష్యంగా పనిచేస్తానని పవన్ స్పష్టం చేశారు.ఈ ఓటమితో కృంగిపోనని చెప్పాడు. అయితే ఏపీలో సమస్యలపై  ఒక్కసారిగా బరస్ట్ కావడం. తర్వాత సైలెంట్ అయిపోవడం తరుచుగా కనిపిస్తోంది.

ఉవ్వెత్తున ఎగిసిపడడం.. మళ్లీ చప్పున చల్లారడం పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిపోయిందని రాజకీయ నేతలే కాదు.. ఇప్పుడు తమ్మారెడ్డి లాంటి సీనియర్ సినీ ప్రముఖులు  విమర్శిస్తున్నారు. రాజకీయాలను పార్ట్ టైంగా చూసుకుంటూ పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను పోగొట్టుకుంటున్నారడనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ మళ్లీ సైలెంట్ అవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News