బాబు వ‌ల్ల తెలుగు త‌మ్ముళ్ల బాధ‌లు

Update: 2015-08-11 06:58 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌స్య‌గా మారారా?  బాబు తీసుకుంటున్న‌నిర్ణ‌యాలు తెలంగాణ తెలుగు త‌మ్ముళ్ల‌ను తిప్ప‌లు పెడుతున్నాయా? అంటే అవున‌ని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు .

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆధేశాల ప్ర‌కారం ముఖ్య‌మంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ స‌ర్కారు ఆధార్ కార్డులను ఓటర్ కార్డుకు అనుసంధానించడం మొద‌లుపెట్టింది. దీంతోపాటు తెలంగాణలో కూడా ఓటర్ కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానించే ప్రక్రియ చురుకుగా సాగుతుంది. అయితే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన రుణ‌మాఫీ విష‌యంలో హైద‌రాబాద్‌ లో ఓటు హ‌క్కు క‌లిగి ఉన్న పలువురు సీమాంధ్రులు ఇబ్బందులు ప‌డ్డారు.

మ‌రోవైపు గత ఎన్నికల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో టీడీపీ గెలవడానికి సెటిలర్ల ఓట్లే కీలకంగా మారాయ‌ని టీఆర్ ఎస్ శ్రేణులు బ‌లంగా న‌మ్ముతున్నాయి. అందుకే గ్రేట‌ర్ ప‌రిధిలో ఆధార్ అనుసంధాన ప్ర‌క్రియ‌పై సీఎం కేసీఆర్ కూడా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే తెలంగాణలో సెటిలర్లు ఇంకా పూర్తిస్థాయిలో ఎక్కడుండాలన్నదానిపై తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఆ ప్రక్రియ కొనసాగితే చాలావరకు స్వ‌రాష్ర్ట‌మైన ఏపీలోనే ఓటుకు ఆధార్ అనుసంధానించుకునే అవకాశం ఉంది. దీంతో టీఆర్ ఎస్ వర్గాలు భావిస్తున్నట్లుగానే హైదరాబాద్ లోనూ ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇవన్నీ సెటిలర్ల ఓట్లేనని టీఆర్ ఎస్ చెప్పింది నిజం అవుతుందని, దానివల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లనుందని టీటీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.


ఒక‌వేళ ఇదే ప‌రిస్థితి ఎదురైతే...వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ని ఖతం చేస్తామని టీఆర్ ఎస్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నిజం అవుతాయ‌ని ఆ పార్టీ నేతలు ఆవేద‌న చెందుతున్నారు. డ‌బుల్ ఓట‌ర్లే టీడీపీ బ‌లం అని టీఆర్ ఎస్ వాదనకు బలం చేకూరే విధంగా ఏపీలోనూ ఆధార్‌ లింక్ చేయడంపై గ్రేటర్ టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విష‌యాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేక సతమతమవుతున్నారు.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి ఆధార్ లంకె అడ్డంకిగా మార‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మే.
Tags:    

Similar News