టీడీపీకి వృద్ధ నేత‌ల త‌ల‌నొప్పులు.. ప‌క్క‌న‌పెడితే ఒక‌లా.. పెట్ట‌క‌పోతే మ‌రోలా?

Update: 2021-08-30 11:30 GMT
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి `పెద్దల‌` స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వృద్ధ నేత‌లు ఉన్నారు. వీరిని వ‌దిలించుకుంటే ఒక బాధ‌, వ‌దిలించుకోకుండా.. కొన‌సాగిస్తే.. మ‌రో బాధ అన్న‌ట్టుగా ఉంది . తాజాగా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యంపై రివ్యూ చేశారు. పార్టీని గాడిలో పెట్టాల‌ని నిర్ణ‌యించారు.  వ‌చ్చే ఎన్నిక‌లు అనుకున్నంత సాదాసీదాగా జ‌రిగేవి కావ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్నా.. ఎవ‌రి బ‌లం వారు చూపించేందుకు రెడీ అవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ పొత్తుల‌పై ఆధార‌ప‌డే క‌న్నా.. సొంత‌గా బ‌లం పుంజుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. దాదాపు 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో వృద్ధ నేత‌లు.. అంటే.. 60 ఏళ్లు పైబ‌డిన వారు తిష్ట‌వేశారు. వారు ఒక‌ప్పుడు వెలిగిన మాట వాస్త‌వ‌మే. ఉదాహ‌ర‌ణ‌కు అర‌కులో కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర‌దేవ్‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని పార్వ‌తీపురంలో శ‌తృచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు, శ్రీకాకుళంలో శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో గుండ ల‌క్ష్మీదేవి, గుంటూరు జిల్లాలో న‌ర‌సారావుపేట‌లో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో గుమ్మ‌డి కుతూహ‌లమ్మ‌, తిరుప‌తిలో సుగుణ‌మ్మ‌.. ఇలా అనేక మంది వృద్ధ నాయ‌కులు ఉన్నారు. వీరంతా.. కూడా ఒక‌ప్పుడు వెలిగిన మాట వాస్త‌వ‌మే. కానీ, ఇప్పుడు మాత్రం వీరి ప‌రిస్థితి దారుణంగా ఉంది.

ప్ర‌భుత్వంపై ఉద్య‌మిద్దాం ర‌మ్మంటే వ‌చ్చే ప‌రిస్థితిలేదు. పోనీ.. సొంత‌గా ఐడియాలైనా ఇస్తున్నారా? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. కానీ, వ‌చ్చే  ఎన్నిక‌ల్లోనూ వీరికే టికెట్లు కావాల‌ని పంతం ప‌డు తున్న ప‌రిస్థితి ఉంది. మ‌రోవైపు.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇత‌ర నేత‌ల‌ను కూడా ఎద‌గ‌నివ్వ‌డం లేద‌నే వాద న ఉంది. యువ‌త బ‌య‌ట‌కు వ‌స్తున్నా.. త‌మ మాటే నెగ్గించుకోవాల‌ని ఈ వృద్ధ నేత‌లు భావిస్తున్నారు. దీంతో యువ‌త ఎవ‌రి మానాన వారు ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వృద్ధ నేత‌ల‌కు పార్టీలో ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి.. వారిని త‌ప్పించాల‌నేది పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం ఆలోచ‌న‌.

ఇదే విష‌యంపై తాజాగా చంద్ర‌బాబు చ‌ర్చించారు. పార్టీలో వృద్ధులుగా ఉన్న‌వారిని త‌ప్పిస్తే.. త‌ప్ప‌.. యువ నాయ‌క‌త్వంలో దూకుడు పెర‌గ‌ద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే.. వృద్ధుల‌ను త‌ప్పిస్తే.. వారి వ‌ల్ల క‌మ్యూనిటీ ఓటు బ్యాంకు దెబ్బ‌తింటుంద‌నే ఆందోళ‌న మ‌రోవైపు బాబును వేధిస్తోంది. పోనీ.. ప‌క్క‌న పెట్ట‌క‌పోతే.. వైసీపీ యువ నాయ‌కుల దూకుడుతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఆవేద‌న క‌నిపిస్తోంది. దీంతో వృద్ధ నేత‌ల‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోకుండా.. వారిని ఒప్పించి.. త‌ప్పించే బాధ్య‌త‌ల‌ను మాజీ మంత్రులు.. నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌.. వంటివారికి అప్ప‌గించాల‌ని సూచ‌న ప్రాయంగా నిర్ణ‌యించారు మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News