పారని ప్లాన్... దెబ్బకు టీడీపీ స్ట్రాంగ్. ..?

Update: 2022-01-02 12:30 GMT
ప్లాన్స్ వేయడం అంటే ఆషా మాషీ వ్యవహారం కానే కాదు. మెదడులో పుట్టిన ప్లాన్ వేసారూ అంటే  వర్కౌట్ అవాల్సిందే. ఆలోచనకు, ఆచరణకు మధ్య తేడా వచ్చిందంటే ఎంత పెద్ద వ్యూహమైనా బెడిసికొట్టినట్లే. ఇపుడు వైసీపీలో దాని మీదనే అంతర్మధనం జరుగుతోంది. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు కావాలి. దానికి కాపు కాసేవారు కూడా కావాలి. అందుకే వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరూ కలసి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు.

కాపుల్లో ఐకాన్ లాంటి వంగవీటి రంగా కుమారుడు రాధాను తీసుకొచ్చి వైసీపీలో చేర్పించాలని. నిజానికి రాధా ఇపుడు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీలో ఆయనకు కోరుకున్న సీటు దక్కుతుందో లేదో తెలియదు. అధినాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు అన్న ఆవేదన కూడా ఎక్కడో ఆయనకు ఉందిట.

ఈ నేపధ్యంలో ఆయనకు రాజకీయాలకు అతీతంగా మంచి దోస్తులు అనతగిన  కొడాలి నాని, వంశీ కలిశారు. అది కూడా రంగా వర్ధంతి వేళ. ఏముంది అంతా ఒక్కటే అన్న ప్రచారం స్టార్ట్ అయిపోయింది. రాధాకు రేపో మాపో ఎమ్మెల్సీ ఇస్తారని, ఆ మీదట మంత్రి పదవి కూడా ఖాయమని కూడా న్యూస్  వెల్లువలా వ్యాపించింది.

ఇదే సమయంలో రాధా ఒక బాంబులాంటి వార్త పేల్చారు. తన ఇంటి వద్ద ఎవరో రెక్కీ నిర్వహించారని, తనకు చంపడానికే అంటూ ఏకంగా రంగా వర్ధంతి వేళనే మంటలు పుట్టించారు. ఇంతకీ రాధాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. ఆయన ఇంటి ముందు ఎందుకు రెక్కీ నిర్వహిస్తారని మొదట అంతా అనుకున్నారు. అయితే ఈ రెక్కీ నిర్వహించింది కూడా వైసీపీలో కీలక నేత అనుచరుడు అంటూ తరువాత వార్తలు వచ్చాయి.

ఈ దెబ్బతో కధ మొత్తం అడ్డం తిరిగింది. మొదట్లో రాధా రెక్కీ వార్తలను పెద్దగా పట్టించుకోని టీడీపీ కూడా కాస్తా లేటుగా అయినా అలెర్ట్ అయింది. చంద్రబాబు విదేశాల్లో ఉండగానే రాధాతో ఫోన్ లో మాట్లాడారు, మేము అండగా ఉన్నామని కూడా హామీ ఇచ్చారు. ఆ వెంటనే డీజీపీకి లెటర్ రాశారు. ఇపుడు అమరావతి వస్తూనే ఏకంగా రాధా ఇంటికి వెళ్ళి గట్టి భరోసా ఇచ్చారు.

రాధా ఇంటి వద్ద జరిగిన రెక్కీ మీద విచారణ జరపాలని, దోషులను పట్టుకోవాలని బాబు డిమాండ్ చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇక రాధా ఇంటికి చంద్రబాబు స్వయంగా రావడం అంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో అదే బిగ్ ట్విస్ట్ అంటున్నారు. రాధా కూడా బాబు రాకతో ఫుల్ హ్యాపీ అయ్యారని, ఆయన పార్టీ మారేది లేదని కూడా అంటున్నారు. మరో వైపు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవడానికి బాబు సిద్ధంగా లేరు.

ఇపుడు చూస్తే బాల్ వైసీపీలో కోర్టులోకి వెళ్ళిపడింది. రెక్కీ నిర్వహించిన ఆ ముఖ్య నేత అనుచరుడిని అర్జంటుగా అరెస్ట్ చేస్తేనే రాధాకు న్యాయం చేసినట్లు అవుతుంది. కానీ అలా చేస్తే వైసీపీకే బురద అంటుకుంటుంది. దీంతో పీక్కోలేక లాక్కోలేక వైసీపీ ఇపుడు అతి పెద్ద ఇబ్బందిలో పడింది అంటున్నారు.


ఏపీలో రాజకీయ సమీకరణలు కూడా పెద్ద ఎత్తున మారుతున్నాయి. కాపులంతా ఒక్కటి అవుతున్నాయి. అలాంటి టైమ్ లో కాపు నేత వంగవీటి వారసుడు రాధాను తమ వైపే ఉంచుకోవడం టీడీపీకి కూడా అవసరం ఇపుడు. దాంతో రాధా టీడీపీలోనే కొనసాగుతారు అంటున్నారు. మరో వైపు ఆయన్ని వైసీపీ బాట పట్టించాలని మంత్రి కొడాలి నాని చేసిన ప్రయత్నాలు మొత్తం బూమరాంగ్ అయ్యాయనే అంటున్నారు. పైగా రాధా బాబుల మధ్య ఉన్న గ్యాప్ ని కూడా ఈ దెబ్బతో లేకుండా చేసిన ఘనతను వైసీపీ నేతలు మూటగట్టుకున్నారని సెటైర్లు పడుతున్నాయి.

ఈ నేపధ్యంలో క్రిష్ణా జిల్లాకే చెందిన వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాధాకు టీడీపీ అని కూడా చూడకుండా తాము సెక్యూరిటీ ఇచ్చామని, రెక్కీ ఘటన మీద వెంటనే  రియాక్ట్  అయ్యామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలు వింటే  రాధాకు ప్రయోజనం ఏమీ ఉండదని కూడా అంటున్నారు. రంగాను హత్య జరిగింది టీడీపీ అధికారంలో ఉన్న టైమ్ లో అని గుర్తు చేస్తున్నారు.  ఒక విధంగా  ఇది అసహనంతో కూడిన మాటలు గానే చూస్తున్నరు. మరో వైపు రాధా ఎపిసోడ్ లో వైసీపీ ఎత్తులు చిత్తులు కావడంతో హై కమాండ్ కూడా సదరు మంత్రి వ్యవహార శైలి మీద సీరియస్ గా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News