అతడికిదే ఆఖరి చాన్స్.. త్వరలో టీమిడింయాకు కొత్త కెప్టెన్?

Update: 2023-06-22 18:00 GMT
ఈ నెల ప్రారంభంలో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఘోర పరాజయంతో టీమిండియాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. జట్టు కూర్పు నుంచి..బ్యాటింగ్ లో షాట్ల ఎంపిక వరకు.. బౌలింగ్ విభాగంలో లోపాల నుంచి ఫీల్డింగ్ అమరికలో తప్పుల వరకు ఎన్నో విమర్శలు. అందులోనూ ప్రతిష్ఠాత్మక ఫైనల్ మ్యాచ్ కు సరైన సన్నద్ధతతో వెళ్లలేదని, కేవలం ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల్లో ప్రయాణం అయ్యారని ఇలా చాలా వ్యాఖ్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రక్షాళన తప్పదనే విశ్లేషణలు వినిపించాయి. అన్నిటికి మించి కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్-టెస్టు స్పెషలిస్టు పుజారా
భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వచ్చాయి.

ఎన్నడూ లేనంత గ్యాప్ తో..

టీమిండియా అంటేనే టెస్టులు-వన్డేలు-టి20లు గ్యాప్ లేకుండా ఆడే ఓ యంత్రం. దీనికితోడు ఐపీఎల్. ఏడాదంతా బిజిబీ షెడ్యూల్. కానీ ఈసారి మాత్రం నెల రోజుల విరామం లభించింది. అనుకోని విధంగా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని ఆటగాళ్లు అలసట నుంచి కోలుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు వచ్చే నెలలో వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఇందులోభాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20లు ఆడుతుంది. జూలై 12న మొదలై ఆగస్టు 13తో ఈ టూర్ ముగియనుంది. కాగా, టి20లకు హార్దిక్ పాండ్యానే శాశ్వత కెప్టెన్ అని తేలిపోయింది. ఇక మిగిలింది టెస్టులు-వన్డేల సంగతి. ఈ రెండు ఫార్మాట్లలో ప్రస్తుతం రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉన్నాడు. అక్టోబరు-నవంబరులో భారత్ లోనే వన్డే ప్రపంచ కప్ ఉన్న రీత్యా ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ మార్పు ఉండనే ఉండదు. అందులోనూ వన్డేల్లో రికార్డు స్థాయిలో మూడు ట్రిపుల్ సెంచరీలు బాదిన రోహిత్ కంటే ప్రపంచంలో ఉత్తమ వన్డే ఆటగాడు ప్రస్తుతానికి ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు.

సంప్రదాయ ఫార్మాట్ లో పరిస్థితేమిటో?

వన్డేల్లో రోహిత్ స్థాయి, రికార్డులు కళ్లు చెదిరేలా ఉన్నాయి. టి20ల్లోనూ హిట్ మ్యాన్ ది గొప్ప ప్రదర్శనే. కానీ, వయసు రీత్యా అతడు మరిక పొట్టి ఫార్మాట్ లో టీమిండియాకు ఆడే చాన్సు లేదు. మిగిలింది టెస్టులు. ఏడాదిరన్న కిందట దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి రోహిత్ కు టెస్టు పగ్గాలు దక్కాయి. మూడేళ్ల కిందటి వరకు తుది జట్టులో సభ్యుడే కాని అతడు ఇప్పుడు ఏకంగా కెప్టెన్. అయితే, ఇదేమంతా సాఫీగా సాగడం లేదు. రోహిత్ ఫిట్నెస్ లెవల్స్,టెక్నిక్ టెస్టులకు సరిపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విదేశీ పర్యటనల్లో అతడి వైఫల్యాన్ని దీనికి ఉదాహరణగా ఎత్తిచూపుతున్నారు. ఇకపోతే
రోహిత్ వయసు 36. దీన్నికూడా ఓ అంశంగా చూపుతున్నారు.

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కోసం..

వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడిన భారత్ వచ్చే నెలలో విండీస్ టూర్ తో మూడో డబ్ల్యూటీసీ సైకిల్ ను మొదలుపెడుతోంది. వాస్తవానికి ఈ సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతి ఇస్తారని భావించారు. కానీ, అదేమీ లేదని అతడే కెప్టెన్ గా వెళ్తాడని తేలింది. అందులోనూ వెస్టిండీస్ టూర్ తర్వాత ఆర్నెళ్ల వరకు మన జట్టుకు టెస్టులు ఆడే వీల్లేదు. కాగా, రెండేళ్ల వ్యవధి ఉండే కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ పూర్తయ్యేసరికి రోహిత్ కు 38 ఏళ్లు వస్తాయి. ఫిట్ నెస్, ఫామ్ పరంగా చూస్తే రోహిత్ అప్పటివరకు కొనసాగలేడనే వాదన తెరపైకి వస్తోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ టూర్ వరకు అతడికి అవకాశం ఇచ్చి చూడనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ విఫలమైతే రోహిత్ టెస్టు కెరీర్ ఖతం. తదుపరి కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ప్రకటించే వీలుంది. అయితే, రాహుల్ ది నిలకడ లేమి. ఒకవేళ రిషభ్ పంత్ ఉండి ఉంటే టెస్టు కెప్టెన్ అతడే అయ్యేవాడు. ఘోర రోడ్డు ప్రమాదం బారిన అతడు మరో ఆరు నెలలకు గాని అందుబాటులోకి రాలేడు. ఇక మరో విధంగా ఆలోచిస్తే.. రోహిత్ ను వచ్చే ఏడాది కాలం పాటు కెప్టెన్ గా కొనసాగించి.. పంత్ పూర్తిగా కోలుకున్నాక అతడికే కెప్టెన్సీ ఇచ్చి రోహిత్ ను గౌరవంగా సాగనంపే అవకాశం ఉంది. ఏదేమైనా రోహిత్ కు ఇది ''టెస్టు'' సమయమే.

Similar News