ఆ సంపాదనలో తెలంగాణ చితక్కొట్టేస్తుందట

Update: 2016-10-15 06:05 GMT
తెలంగాణ సంపన్న రాష్ట్రమని తరచూ చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు తగ్గట్లే.. తెలంగాణ వెలిగిపోతుందన్న భావన కలిగే గణాంకాలు తెరపైకి వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖల ఆదాయాల‌ను ప‌రిశీలిస్తే... తొలి ఆర్నెల్ల వ్యవధిలో తెలంగాణ దూసుకెళ్లి.. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఎంతో ముందు ఉండటం విశేషం. దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల(తెలంగాణ.. ఏపీ.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ) లో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్లలో తెలంగాణ భారీ వృద్ధి రేటును నమోదు చేసినట్లుగా తేలింది.

తలసరి ఆదాయం పెరగటంతో పాటు.. కొనుగోలు సామర్థ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్న వైనం బయటకు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్ల వ్యవధిలో 31.21 శాతం వృద్ధి రేటును సాధించిన తెలంగాణ రాష్ట్రం.. దక్షిణ భారతంలో మొదటి స్థానంలో నిలవటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ తర్వాత రెండో స్థానంలో ఏపీ నిలిచింది. ఈ రెండు రాష్ట్రాల మినహా మిగిలిన రాష్ట్రాలేవీ కూడా రిజిస్ట్రేషన్లలో దరిదాపుల్లోకి రాకపోవటం గమనార్హం.

ప్రభుత్వం మీద పెరిగిన విశ్వాసం.. అత్యుత్తమ పారిశ్రామిక విధానం.. అభివృద్ధిలో దూసుకుపోతున్న తీరుతో పాటు.. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి.. నిరంతర విద్యుత్ తో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోందని.. దీంతో స్థిరాస్తి వ్యాపారం మాంచి జోరు మీద ఉండటంతో పాటు.. తెలంగాణలోని భూముల అమ్మకాలు.. కొనుగోళ్లు భారీగా సాగుతున్నట్లుగా తేల్చారు.

గత ఏడాది తొలి ఆర్నెల వ్యవధిలో స్టాంపులు..  రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.1475 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అదే కాలంలో ఈ ఆదాయం రూ.1935.3 కోట్లకు పెరగటం గమనార్హం. ఈ ఏడాది నిర్ణయించిన లక్ష్యంలో మొదటి ఆర్నెల్లలో 45 శాతం పూర్తి కావటం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. దక్షిణాదిన తెలంగాణ 31.2 శాతం వృద్ధి రేటు సాధించగా.. తర్వాతి స్థానంలో ఏపీ 12.2 శాతం.. కేరళ 3.5 శాతం.. తమిళనాడు 2.6 శాతం .. కర్ణాటక 2.3 శాతం వృద్ధిరేటును నమోదు చేశాయి.

భూముల కొనుగోళ్లు అమ్మకాల విషయంలో ముందున్న తెలంగాణలో జిల్లాల వారీగా చూస్తే.. అత్యధిక ఆదాయం మెదక్ జిల్లా నుంచి వచ్చింది. మొత్తం ఆదాయంలో 47.9 శాతం మెదక్ నుంచి రాగా.. తర్వాతి స్థానం అదిలాబాద్ (38.09 శాతం) ఉండగా.. చివరి స్థానంలో నల్గొండ (6.94 శాతం) నిలిచింది. ఇదిలా ఉండగా.. వాణిజ్య పన్నుల ఆదాయం కూడా అంచనాలకు మించి రావటం తెలంగాణకు శుభసూచకంగా భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్లలో రూ.16,992 కోట్లు ఆదాయం వచ్చింది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ ఆదాయం ముందుగా వేసుకున్నఅంచనా కంటే రూ.2వేల కోట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం వృద్ధిపథంలోకి దూసుకెళుతుందన్న మాటకు తాజా గణాంకాలే నిదర్శనంగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News