బీజేపీ ప‌వ‌ర్లోకి వ‌స్తే ఆరింటికే బార్లు మూయిస్తార‌ట‌

Update: 2018-10-14 06:17 GMT
ఆశ బారెడు.. పీక మూరెడ‌న్న‌ట్లుగా ఉంటుంది తెలంగాణ బీజేపీ య‌వ్వారం. ఆ పార్టీకి ప‌ట్టుమ‌ని ప‌ది సీట్లు లేకున్నా.. భ‌విష్య‌త్తులో వ‌చ్చే అవ‌కాశం లేకున్నా.. తెలంగాణ‌లో అంత పొడుస్తాం.. ఇంత పీకుతామంటూ క‌మ‌ల‌నాథులు చెప్పే మాట‌లు మామూలుగా ఉండ‌వు. కొన్ని సంద‌ర్భాల్లో వారు చేసే వ్యాఖ్య‌లు కామెడీ.. కామెడీగా ఉంటాయి.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో గెలుచుకున్న సీట్ల‌ను ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టుకుంటే గొప్ప అన్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ‌.. బీజేపీ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు మామూలుగా లేవు. తెలంగాణ‌లో తాము అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని వారు చేస్తున్న వ్యాఖ్య‌లు అతిశ‌యానికే ఆశ్చ‌ర్య‌మేసేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌వ‌ర్లోకి తీసుకొస్తే ఇన్ని వరాలు ఇస్తామ‌ని చెప్పే క‌మ‌లనాథులు.. ఇప్ప‌టికే అధికారాన్ని ఇచ్చిన మోడీ స‌ర్కారు.. ఈ హామీల్లోని కొన్నింటినైనా అమ‌లు చేయొచ్చుగా.  అధికారం ఇస్తే ఏం పీక‌లేని వారు.. కొత్త‌గా ఇస్తే ఏదేదో పీకుతామ‌ని చెప్ప‌టంలో అర్థం ఉందా క‌మ‌ల‌నాథులు?  

తాజాగా త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌ర్చే అంశాల గురించి వివ‌రాలు వెల్ల‌డించారు. తెలంగాణ బీజేపీ. తాము అధికారంలోకి వ‌స్తే ఆరింటికే బార్లు.. లిక్క‌ర్ షాపులు బంద్ చేస్తామ‌న్న ఆస‌క్తిక‌ర హామీతోపాటు.. బోలెడ‌న్ని హామీలకు సంబంధించిన అంశాల్ని శాంపిల్ గా బ‌య‌ట‌కు వెల్ల‌డించారు. ఆ అంశాల్ని చూస్తే..

+ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లో ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీ.. అందుకు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల‌

+ మ‌ద్యం అమ్మ‌కాలను నియంత్రిస్తాం. వారంలో ఐదు రోజులే మ‌ద్యం అమ్మ‌కాలు

+ మ‌ద్యం షాపులు.. బార్ల‌ను సాయంత్రం ఆరింటికే మూసేస్తాం.

+ ప్ర‌భుత్వ ఆదాయాన్ని పెంచి.. అప్పుల్ని త‌గ్గిస్తాం

+ అన్ని వ‌న‌రుల్ని స‌ద్వినియోగం చేసుకొని ప్ర‌భుత్వానికి  ఆదాయం పెంచుతాం.

+ పండ‌గ‌లు.. జాత‌ర స‌మ‌యాల్లో న‌డిపే ప్ర‌త్యేక బ‌స్సుల‌పై అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వు

+ అయ్య‌ప్ప దీక్ష‌.. కొండ‌గ‌ట్టు హ‌నుమాన్ దీక్ష‌ల‌కు వెళ్లే భ‌క్తుల‌కు ఉచిత ర‌వాణా స‌దుపాయం

+ పెట్రోల్‌.. డీజిల్ పై రాష్ట్రం  విధించే వ్యాట్ ను పూర్తిగా తొల‌గిస్తాం.

+ గ్రామ పంచాయితీలు.. మున్సిపాలిటీ.. కార్పొరేష‌న్ల ప‌రిధిలోని పొరుగుసేవ‌ల ఉద్యోగుల‌ను శాశ్విత ఉద్యోగులుగా మారుస్తాం.

+ ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జూనియ‌ర్.. డిగ్రీ కాలేజ్ ఏర్పాటు

Tags:    

Similar News