బడ్జెట్ ను భారీగా సిద్ధం చేసిన కేసీఆర్ సారూ

Update: 2021-03-17 04:30 GMT
మరో రోజులో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వరుసగా బడ్జెట్లను ప్రవేశ పెడుతున్న టీఆర్ఎస్ సర్కారు.. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. గతానికి మించి.. తొలిసారి రూ.2లక్షల కోట్లకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.82లక్షల కోట్లకు బడ్జెట్ ప్రతిపాదనల్ని రూపొందించిన ప్రభుత్వం.. ఈసారి అంతకు మించి రూ.2లక్షల కోట్లకు బడ్జెట్ అంచనాల్ని ప్రతిపాదించనున్నారు.

కరోనా దెబ్బకు గత ఆర్థిక సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైనా.. ఈ జనవరి నుంచి అన్ని రంగాలు కోలుకోవటంతో పాటు.. మునుపటి వేగానికి అందుకుంటాయన్న అంచనాలతో.. భారీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. తాజాగా జరిగిన బడ్జెట్ సమీక్షలో రాష్ట్ర రాబడులు గణనీయంగా పెరుగుతున్న విషయం చర్చకువచ్చింది. గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండటం.. రాష్ట్రం సొంత పన్నుల రాబడిని పెంచుకోవటంతో పాటు.. ఆదాయాన్ని సమకూర్చుకోవటానికి వీలుగా రుణాలు.. భూముల అమ్మకాన్ని చేపట్టాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

అమ్మకం పన్ను.. జీఎస్టీతో పాటు ఎక్సైజ్ రాబడి మూడు నెలలుగా భారీగా పెరిగింది. పన్నేతర రాబడిలో భూముల అమ్మకాలు కీలకం కానున్నాయి. దీంతో.. తాము ప్రతిపాదించాలని భావిస్తున్న రూ.2లక్షల కోట్ల బడ్జెట్ కు ఇబ్బందులు ఉండవన్న ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఉంది. ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెరగటంతో మార్కెట్ రుణాలు గత ఏడాది కంటే ఎక్కువే తీసుకునే వెసులుబాటు ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో స్పష్టత ఉండటం.. సొంత రాబడుల్ని మరింత పెంచుకునే అవకాశం ఉండటంతో.. ప్రతిపాదనల్ని భారీగా చేపట్టినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News