పవర్ లేని వేళ విమోచన.. పవర్ ఉన్నప్పుడు సమైక్యతా ఉత్సవమా కేసీఆర్?

Update: 2022-09-18 05:46 GMT
రాజకీయ నేతల నోటి మాటకు.. నీళ్ల మూటలకు పెద్ద తేడా లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఇందుకు నిదర్శనంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తున్న వేళ.. సెప్టెంబరు 17 వస్తే చాలు.. విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని.. తెలంగాణ రాష్ట్రం సాకారమైన వేళలో.. ఆ రోజును ఘనంగా నిర్వహిస్తామని కేసీఆర్ పదే పదే చెప్పటం చాలామందికి గుర్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉద్యమ వేళలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవటానికి కేసీఆర్ పెద్దగా ఇష్టపడలేదన్న వైనం తెలిసిందే.

ఉద్యమం వేళ విమోచన మాటను పదే పదే ప్రస్తావించిన ఆయన.. అధికారం వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో ఆ ఊసే పట్టలేదు. అలాంటి కేసీఆర్ తాజాగా మాత్రం.. 'సమైక్యతా వజ్రోత్సవం' పేరుతో భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న వైనం తెలిసిందే. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా ఉండాలంటూ ఉద్యమించి మరీ ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కేసీఆర్ కు.. జాతీయ సమైక్యతా ఉత్సవాన్ని చేపడతారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఒకే భాష మాట్లాడే తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా ఉండాలని కోరుతూ విభజన కోసం ఉద్యమించిన ఆయన.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జాతీయ సమైక్యతా పల్లవిని ఆలపించటం సబుబేనా? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఉద్యమ నేతగా ఉన్నన్ని రోజులు విమోచన మాటను పట్టుకొని తిరిగిన కేసీఆర్.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వేళ.. సమైక్యతా రాగాన్ని ఆలపించటం గమనార్హం. 1948 సెప్టెంబరు 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు చెప్పిన కేసీఆర్.. మరి.. గడిచిన ఏడేళ్ల కాలంలో మరెందుకు జరపలేదు? అన్న ప్రశ్నకు కేసీఆర్ ఏం సమాధానం ఇస్తారు? అన్నది అసలు ప్రశ్న.
Tags:    

Similar News