మీటింగ్ కంటే..ధ‌ర్నాకే ఎక్కువ మంది వ‌చ్చారు!

Update: 2019-03-04 04:59 GMT
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో క‌డుపు మండిపోయేలా చేస్తుంద‌ని చెబుతున్నారు. కొద్ది నెల‌ల ముందు జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. ఇంకేముంది గెల‌వ‌ట‌మే త‌రువాయి.. అధికారం అర‌చేతికి వ‌చ్చేసిన‌ట్లే అన్న‌ట్లుగా ఫీల్ కావ‌ట‌మే కాదు.. సీఎం ప‌ద‌వి త‌మ‌కంటే త‌మ‌కే అంటూ క‌ర్చీఫ్ లు.. తుండ‌గుడ్డ‌లు వేసిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

కాంగ్రెస్‌కు క‌రెంటు షాక్ త‌గిలేలా.. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదు స్థానాలు త‌మ‌కే ద‌క్కాల‌న్న‌ట్లుగా కేసీఆర్ డిసైడ్ కావ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే వ్యూహాన్ని సిద్ధం చేసి.. ఇప్ప‌టికే ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ లోకి వ‌చ్చిన తీరుతో కాంగ్రెస్ పార్టీ కిందా మీదా ప‌డుతోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గులాబీ కారులోకి ఎక్కేందుకు డిసైడ్ కావ‌టం.. మ‌రికొంద‌రు పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నార‌న్న ప్ర‌చారంతో అలెర్ట్ అయ్యింది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ అనుస‌రిస్తున్న విధానాలు ఏ మాత్రం స‌రికావంటూ కాంగ్రెస్ ఇప్పుడు పోరాటాలు చేయాల‌ని నిర్ణ‌యించింది. మ‌జ్లిస్ మ‌ద్ద‌తుతో ఐదో స్థానాన్ని త‌మ సొంతం చేసుకునేందుకు వీలుగా ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యేను.. కాంగ్రెస్ కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను త‌మ వైపున‌కు ఆక‌ర్షించిన కేసీఆర్ అండ్ కో తీరుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ అనుస‌రిస్తున్న విధానం ఏ మాత్రం స‌రికాదంటూ ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు హాజ‌రు కాగా.. అనంత‌రం నిర్వ‌హించిన ధ‌ర్నాకు 16 మంది ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. ఇక‌.. ఈ ఎపిసోడ్ లో భాగ‌స్వామ్యం కాని మరో ఎమ్మెల్యే ఉపేంద‌ర్ రెడ్డి అనారోగ్యంతో హాజ‌రు కాలేద‌ని చెబుతున్నారు. పార్టీ మారనున్న‌ట్లుగా ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త చేసిన ఎమ్మెల్యేలు ఆత్రం స‌క్కు.. రేగా కాంతారావుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డేలా చేయాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. స‌మావేశానికి.. ధ‌ర్నాకు వ‌చ్చిన ఎమ్మెల్యేలంతా తాము కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతామ‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లో గులాబీ కారు ఎక్కే ప్ర‌స‌క్తే లేద‌ని చెబుతున్నారు. ఇలా చెప్పిన వారిలో జ‌గ్గారెడ్డి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌టం.. కేసీఆర్ గుర్రుగా ఉన్నార‌ని చెప్పే హ‌రీశ్ మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే.. త‌న తీరు.. వ్యాఖ్య‌లు.. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌తో కొంద‌రు గంద‌ర‌గోళానికి గురి అవుతున్నార‌ని.. అయిన‌ప్ప‌టికీ తాను మాత్రం కాంగ్రెస్ లోనే కొన‌సాగ‌నున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. మ‌రి.. ఇంత క‌మిట్ మెంట్ తో మాట‌లు చెబుతున్న వారు.. రేపొద్దున ఓటింగ్ వేళ‌లో ఏం చేస్తారో చూడాలి.


Tags:    

Similar News