చేరిక‌ల ఎఫెక్ట్‌: బిజీబిజీగా తెలంగాణ గాంధీభ‌వ‌న్‌

Update: 2023-06-28 12:00 GMT
తెలంగాణ‌లోని గాంధీభ‌వ‌న్‌.. కొన్నిరోజులుగా క‌ళ‌క‌ళ‌లాడుతోంది. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత‌.. వ‌చ్చిన రెండు అసెంబ్లీ రెండు పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ పేల‌వమైన ఫ‌లితాన్ని చూపించిన కాంగ్రెస్‌లో గ‌త 8 ఏళ్లుగా పెద్ద‌గా ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. పైగా ఎక్క‌డిక‌క్క‌డ వివాదాలు, విభేదాల‌తోనే నాయ‌కులు కాలం గ‌డుపుతున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లుఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో చేరిక‌ల ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చేవారికి కాంగ్రెస్ రెడ్ కార్పెట్ ప‌రిచింది. దీంతో అనూహ్యంగా కాంగ్రెస్‌లో కొత్త జోష్ క‌నిపిస్తోంద‌నే చ‌ర్చ ప్రారంభమైంది. ప్ర‌ధానంగా పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. అదికూడా అంచ‌నాల‌కు మించి.. సీట్ల‌ను రాబ‌ట్టుకున్న ద‌రిమిలా.. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కు కూడా అంద‌రూ క‌ష్టిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు.

అదేస‌మ‌యంలో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే వ్యూహంలో భాగంగా.. ఇత‌ర పార్టీల్లో అసంతృ ప్తులుగా ఉన్న‌వారిని కూడా చేర్చుకునే ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు.

దీంతో ఇటీవ‌ల కాలంలో గాంధీ భ‌వ‌న్ బిజీబిజీగా మార‌డంతోపాటు.. నేత‌లతోనూ హ‌డావుడిగా మారి.. క‌ళ‌క‌ళ‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం.

న‌మ్మ‌కం క‌లుగుతోంది!ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్‌పై నేత‌ల్లో న‌మ్మ‌కం పెరిగింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. క‌ర్ణాట‌క‌లో హిం దూత్వ అజెండా అందుకున్న బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో తెలంగాణ‌లోనూ బీజేపీని ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే.. ఆ పార్టీలోకి చేరాల‌ని అనుకున్న‌వారు.. ప్ర‌స్తుతం ఉన్న‌వారు కూడా.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. పైగా.. ఖ‌మ్మం నుంచి కీలక‌నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేరిక ఖాయం కావ‌డం.. మ‌రింతగా పార్టీకి దోహ‌ద ప‌డుతోంద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపు.. గాంధీ భ‌వ‌న్‌కు కొత్త క‌ళ వ‌చ్చాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News