గవర్నర్ ఎందుకు కెలుక్కుంటున్నారు?

Update: 2022-07-27 05:33 GMT
తెలంగాణా గవర్నర్ తమిళిసై వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ తో గవర్నర్ సంబంధాలు ఏమాత్రం బావోలేదన్న విషయం అందరికీ తెలుసు. గవర్నర్ కు కేసీయార్ పూర్తిస్థాయిలో సహాయనిరాకరణ చేస్తున్నారనటంలో సందేహం లేదు. ఇదే సమయంలో కేసీయార్ సహకారం లేకపోయినా గవర్నర్ తాను చేయదలచుకున్న పనులను చేసేస్తున్నారు.

అంటే ఇద్దరు కూడా రైలు పట్టాల్లాగ పనిచేసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలోనే కేసీయార్ పై గవర్నర్ తా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు బాగా వివాదాస్పదమయ్యాయి. ఏ గవర్నర్ కూడా ముఖ్యమంత్రి భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైన మాట్లాడరు. రాజకీయాలంటేనే 1+1=2 కాదన్న విషయం అందరికీ తెలుసు. 1+1 కొన్నిసార్లు 0 అవుతుంది మరికొన్నిసార్లు 4 లేదా 6 కూడా కావచ్చు. ఇదే రాజకీయాల్లో ఉన్న గమ్మత్తు.

బహుశా ఇలాంటి రాజకీయాలు తమిళిసైకి అనుభవంలోకి వచ్చినట్లు లేదు. అందుకనే కేసీయార్ జాతీయ రాజకీయాలపై నోటికొచ్చింది మాట్లాడేశారు. ఢిల్లీలో గవర్నర్ మాట్లాడుతు నరేంద్రమోడీపై వ్యతిరేకతతోనే కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

అలాగే జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్ పూర్తిస్ధాయిలో ప్రవేశిస్తారని అనుకోవటం లేదన్నారు. అంతటితో ఆగకుండా జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్ ప్రవేశించినా సక్సెస్ కాలేరని కూడా అన్నారు.

దీనిపైనే ఇపుడు యావత్ టీఆర్ఎస్ యంత్రాంగం గవర్నర్ పై మండిపోతున్నారు. గవర్నర్ వ్యాఖ్యలతోనే తాను బీజేపీ కార్యకర్తను అని బయట పెట్టుకుందని గవర్నర్ పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపోయారు.

సీపీఐ నారాయణ మాట్లాడుతూ బరితెగించి మాట్లాడిన గవర్నర్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేయాలంటు డిమాండ్ చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కేసీయార్ తెలంగాణాలోనే ఉంటారా ? జాతీయ రాజకీయాల్లోకి వెళతారా ? అక్కడ రాణిస్తారా లేదా అన్నది పూర్తిగా కేసీయార్ వ్యక్తిగతం. ఈ విషయంలో గవర్నర్ ప్రమేయమే అవసరం లేదు. అయినా మాట్లాడారంటే అనవసరంగా కెలుక్కుంటున్నట్లే ఉంది.
Tags:    

Similar News