తెలంగాణలో ఎవరి బీర్ వారిదేనా?

Update: 2015-08-29 04:18 GMT
తెలంగాణ రాష్ట్ర సర్కారు మరో ముందడుగు వేసింది. సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి దూకుడును ప్రదర్శిస్తుందో.. ఇంచుమించే అదే తీరులో ఎక్సైజ్ విధానంలో సమూలంగా మార్పులు చేయటంతో పాటు.. సరికొత్త నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మైక్రో బ్రూవరీలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవటం విశేషం.

తాజా నిర్ణయంతో ఎవరి బీర్ ను వారే.. సొంతంగా తయారేసుకునే వీలుంది. అంతేకాడు.. తమదైన బ్రాండ్లతో అమ్ముకునే సదుపాయం ఉంది. కాకపోతే బీరు తయారు చేసిన 36 గంటల వ్యవధిలోనే సదరు బీరును తాగాల్సి ఉంది. వాటర్ ఫ్లాంట్లు ఏ విధంగా అయితే నెలకొల్పుతారో.. తాజా విధానంతో చిన్న చిన్న బీరు ఫ్లాంట్లను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.

వెయ్యి చదరపు మీటర్ల స్థలాన్ని చూపించి.. రోజుకు వెయ్యి లీటర్ల బీరును తయారు చేసుకునేలా తెలంగాణ సర్కారు సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. పెద్ద పెద్ద హోటళ్లు.. ప్రముఖ బార్లు.. రెస్టారెంట్లు తమదైన బీరును తయారు చేసుకొని.. తమ బ్రాండ్ వేసుకొని అమ్ముకునే వీలు ఉంటుంది. ఇందుకు తగిన విధంగా శుక్రవారం(ఆగస్టు28) నాడు జీవో నెంబరు 151ను తెలంగాణ సర్కారు విడుదల చేసింది.

తొలిదశలో జీహెచ్ ఎంసీ పరిధితో పాటు.. దాన్ని అనుకొని ఉండే 5 కిలోమీటర్ల ప్రాంతాల్లోనూ.. పర్యటక ప్రాంతాల్లోనే ఇలాంటి ఫ్లాంట్లను ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఇస్తారు. తర్వాతి దశల్లో కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లోనూ తమ సొంత బ్రాండ్లలో బీరు తయారు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ లోకల్ బీరు తయారీకి సంబంధించిన అనుమతులు.. విధివిధానాలు చాలా సులభంగా ఉండటంతో.. రానున్న రోజుల్లో ‘‘లోకల్ బీరు’’ హవా నడవటం ఖాయమన్న వాదన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News