ఏపీ వాసుల‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన తెలంగాణ‌

Update: 2020-05-31 12:21 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ క‌ట్ట‌డి కోసం లాక్‌ డౌన్ విధించారు. దీంతో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హైద‌రాబాద్‌ లో స్థిర‌ప‌డిన ఏపీవాసులు స్వ‌రాష్ట్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు. లాక్‌డౌన్ విధించిన స‌మ‌యంలో అతిక‌ష్ట‌మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌వాసులు సొంత ప్రాంతాల‌కు వెళ్లారు. ప్ర‌స్తుతం కార్యాల‌యాలు మొ‌ద‌ల‌వ‌డంతో హైద‌రాబాద్‌ కు వ‌ద్దామ‌నుకుంటే అంత‌ర్రాష్ట్ర రాక‌పోక‌లు మొద‌లు కాలేదు. ఏపీకి - తెలంగాణ‌కు మ‌ధ్య ర‌వాణా సౌక‌ర్యాలపై నిషేధం కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డి వారు తెలంగాణ‌లోకి రాలేక‌పోతున్నారు. మే 31వ తేదీతో నాలుగో ద‌శ లాక్‌ డౌన్ ముగిసి జూన్ 1 నుంచి లాక్‌ డౌన్ 5 అమ‌లు కానుంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన‌ట్టు అంత‌ర్రాష్ట్ర ర‌వాణా మొద‌లు కానుంది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

జూన్ 1వ తేదీ నుంచి 30 వ‌ర‌కు ఐదో ద‌శ లాక్‌ డౌన్ విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆదివారం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో మరికొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు ప‌చ్చ‌జెండా ఊపింది. ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసినట్లయ్యింది. నిషేధం ఎత్తివేయ‌డంతో మ‌హారాష్ట్ర‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - చ‌త్తీస్‌ ఘ‌డ్‌ - క‌ర్నాట‌క రాష్ట్రాల‌కు రాక‌పోక‌లు మొద‌లుకానున్నాయి. అయితే ఈ మేర‌కు ఆయా రాష్ట్రాలు కూడా అంగీకారం తెలిపితే తెలంగాణ‌తో ఇత‌ర రాష్ట్రాల ర‌వాణా మొద‌లుకానుంది.

తెలంగాణ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యంతో హైద‌రాబాద్‌ లో స్థిర‌ప‌డిన ఉద్యోగులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో చిక్కుకున్నారు. వారంతా ఇప్పుడు హైద‌రాబాద్‌ కు త‌ర‌లిరానున్నారు. ఇప్ప‌టికే ప్రైవేటు - ప్ర‌భుత్వ కార్యాల‌యాలు - సంస్థ‌లు మొద‌ల‌య్యాయి. సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో ఉద్యోగులు - వ్యాపారులు ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు రానున్నారు. ఈ మేర‌కు రెండు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ ర‌వాణా పున‌రుద్ధ‌ర‌ణ కానుంది. దీంతో ఏపీవాసులు దాదాపు రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ తెలంగాణ‌లోకి అడుగుపెట్ట‌నున్నారు. అయితే విద్యాసంస్థ‌లు ప్రారంభం కాక‌పోవ‌డంతో విద్యార్థులు ఇంకా ఏపీలోనే ఉండే అవ‌కాశం ఉంది.




Tags:    

Similar News