టీ మంత్రి కొడుకే.. దుప్పుల వేట‌గాడా?

Update: 2017-03-24 06:36 GMT
అమాయ‌క జీవుల్ని వెంటాడి.. వేటాడి చంపేసే వేటాగాడి ఉదంతం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిన వైనం రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. అత్యంత కిరాతాకంగా హ‌త్య చేసి.. వాటి మాంసాన్ని అక్ర‌మంగా ఎగుమ‌తి చేసేందుకు వీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తి ఎవ‌రో కాద‌ని.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొడుకేన‌న్న స‌మాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగింది? ఎలా జ‌రిగింది? మ‌ంత్రి కొడుకే వేట‌గాడ‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఎలా సాధ్య‌మైంద‌న్న విష‌యాన్ని చూస్తే..

తాజాగా బ‌య‌ట‌కు వెలుగు చూసిన ఈ ఉదంతం కాస్త ఆల‌స్యంగా వ‌చ్చింద‌ని చెప్పాలి. ఆదివారం అర్థ‌రాత్రి జ‌య‌శంక‌ర్ జిల్లా మ‌హ‌దేవ‌పూర్ మండ‌లంలోని అంబ‌ట్ ప‌ల్లి.. సూరారం స‌మీపంలోని అడ‌వుల్లో దుప్పుల్ని వేటాడుతున్నార‌న్న స‌మాచారాన్ని అట‌వీశాఖాధికారులు అందుకున్నారు. వెంట‌నే వారు త‌నిఖీలు చేపట్టారు. ఇదిలా ఉండ‌గా.. ఏపీ 13 ఏఈ 2752 నెంబ‌రున్న ఇండికా  విస్టా వెహికిల్ అట‌వీశాఖ అధికారులు వాహ‌నాన్ని ఢీ కొట్టింది.

వాహ‌నంలోని నుంచి దిగిన ఐదుగురు దుండ‌గులు అధికారుల్ని తుపాకీతో బెదిరించి.. వేరే వాహ‌నంలో పారిపోయారు. ఇదిలా ఉండ‌గా.. దాదాపు మూడు వాహ‌నాల్లో ప‌దిహేను మంది వ‌ర‌కూ దుండ‌గులు వ‌చ్చి దుప్పుల్ని వేటాడిన‌ట్లుగా చెబుతున్నారు. దుండ‌గులు వ‌దిలేసి వెళ్లిన కారును స్వాధీనం చేసుకున్న అధికారులు.. కారును ప‌రిశీలించ‌గా.. రెండు చ‌నిపోయిన దుప్పులు ఉన్న‌ట్లు గుర్తించారు.

అయితే.. అట‌వీ శాఖ అధికారుల్ని బెదిరించి పారిపోయిన దుండ‌గులు ఐదుగురు కాద‌ని.. మొత్తం ప‌దిహేను మంది అని.. రెండు వాహ‌నాల్లో వారు వెళ్లిపోయార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. త‌మ వెంట మ‌రో మూడు దుప్పుల్ని వారు తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌రారైన రెండు వాహ‌నాల గురించి పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇక‌.. దుండ‌గులు విడిచి పెట్టిన కారు య‌జ‌మాని ఎవ‌ర‌న్న‌ది ప‌రిశీలించ‌గా.. ఫ‌జ‌ల్ అహ్మ‌ద్ ఖాన్ గా గుర్తించారు. గుర్తు తెలియ‌ని న‌లుగురు వ్య‌క్తుల‌పై వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టంలోని వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. హైద‌రాబాద్ నుంచి పెద్ద స్థాయి నుంచి వ‌చ్చిన ఒత్తిళ్ల కార‌ణంగానే దుండ‌గుల్ని వ‌దిలేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

దుప్పుల్ని వేటాడిన వేట‌గాళ్ల‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కుమారుడు ఉన్న‌ట్లుగా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ముఖ్య‌మంత్రి త‌ర్వాత‌.. అంత ప్రాధాన్య‌త ఉన్న స్థానానికి చెందిన మంత్రి కుమారుడే హంట‌ర్ అన్న వాద‌న వినిపిస్తోంది. అట‌వీ అధికారులు స్వాధీనం చేసుకున్న కారులో విమానం టికెట్లు కూడా ఉన్న‌ట్లుగా స‌మాచారం. వేర్వేరు రాష్ట్రాల‌కు.. విదేశాల‌కు దుప్పుల మాంసం ఎగుమ‌తి చేసే ముఠా దీనికి పాల్ప‌డుతున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ స‌మాచారంతో తెలంగాణ అధికార‌ప‌క్షం ఎంత‌మేర రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News