తెలంగాణ రాజకీయాల్లో ఫ్రీ కోచింగ్ ట్రెండ్ మామూలుగా లేదుగా?

Update: 2022-05-10 02:30 GMT
తెలంగాణ యువత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావటం.. భారీ ఎత్తున ఆశావాహులు అప్లికేషన్లు పెట్టుకోవటంలో బిజీ కావటం తెలిసిందే. నాణెనికి ఇదో కోణం అయితే.. మరో కోణం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కు తెర తీసిందని చెప్పాలి. భారీ ఎత్తున విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో మిగిలిన పార్టీల కంటే ముందుంది అధికార టీఆర్ఎస్ పార్టీ.

ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అన్న తేడా లేకుండా జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లోని మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉద్యోగఅభ్యర్థులకు అవసరమైన ఫ్రీ కోచింగ్ ను షురూ చేశారు. కొందరు కోచింగ్ తో సరిపెడితే.. మరొకొందరు నేతలు మరో అడుగు ముందుకు వేసి.. బస కూడా ఏర్పాటు చేస్తున్నారు. తమ నియోజకవర్గం పరిధిలోని యువతను ఆకర్షించేందుకు.. వారి విషయంలో తాము ఎంతలా కష్టపడతున్నామన్న భావన కలిగేలా చేయటం కోసం కోచింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

తాజాగా మహబూబ్ నగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్ పో ప్లాజాలో శాంతానారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాంపిటీటివ్ పరీక్షా పుస్తకాల్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ షురూ చేయటం చూస్తే.. లెక్కలు ఏ రీతిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. రానున్న ఆర్నెల్ల పాటు ఇంటర్నెట్ వాడొద్దన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోరారు. అందరూ తమ ఫోకస్ అంతా చదువు మీదనే పెట్టాలని.. అందరూ మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం.. ఇప్పుడుకానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం భారీ ఎత్తున ట్రైనింగ్ ఇప్పించటం ద్వారా స్థానిక నేతల విషయంలో యువత సానుకూలంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

ఈ విషయాన్ని మిగిలిన పార్టీలతో పోలిస్తే.. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ కాస్త ముందు ఉందని చెప్పాలి. ఆ పార్టీకి చెందిన పలువురునేతలు ఇప్పటికే.. ఫ్రీ కోచింగ్ సెంటర్లు షురూ చేశారు. మిగిలిన పార్టీలకు చెందిన కొద్ది మంది మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా గులాబీ పార్టీలో ఇప్పుడు ఫ్రీ కోచింగ్ సెంటర్ల హడావుడి భారీగా ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడేలా చేసుకోవటంతో టీఆర్ఎస్ తర్వాతే ఎవరైనా బాస్.
Tags:    

Similar News