తెలంగాణలో పోలింగ్‌ శాతం పెరుగుతోందా? తగ్గుతోందా?

Update: 2018-12-05 17:38 GMT
ఓటర్లలో చైతన్యం, మారుతున్న పరిస్థితుల కారణంగా ఎలక్షన్లలో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. తొలినాళ్లలో ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ రాను రాను ఆశాజనకంగా ఉంటోంది. ఎన్నికల సంఘం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, స్వచ్ఛంద సంస్థల అవగాహన కార్యక్రమాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఓటింగ్ శాతం పెరిగేందుకు సోషల్ మీడియా కూడా ఒక ముఖ్య కారణమవుతోంది.

1957 నుంచి 2014 వరకు గణాంకాలను పరిశీలిస్తే... 1957లో 47.67 శాతం పోలింగ్ నమోదైంది. 1962లో 64 శాతంగా రికార్డయింది. ఇక 1967లో 69.15 శాతం పోలింగ్ నమోదవగా... 1972లో అది 59.71గా ఉంది. 1978లో 72.92 శాతం, 1983లో 67.70 శాతం ఓటింగ్ పర్సంటేజ్ రికార్డయింది. 1985లో 67.57 శాతం, 1989లో 70.44 శాతం ఓట్లు పోలయ్యాయి. 1994లో 71.02 శాతం, 1999లో 69.15 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2004లో 69.96 శాతం, అదే ఏడాదిలో మరోసారి 72.37 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2014లో అత్యధికంగా 74.20 శాతం ఓటింగ్ జరిగింది.

ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిలో స్త్రీల కన్నా పురుషులే ముందంజలో ఉన్నారు. 1978లో 76.14 శాతం పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే ఇప్పటి వరకు అత్యధికం. ఇక 2014 లో 74.22 శాతం పురుషులు ఓటేశారు. ఆ ఏడాది మాత్రం మహిళలే ఆధిపత్యంలో ఉన్నారు. 2014లో 75.18 శాతం స్త్రీలు పోలింగ్ లో పాల్గొన్నారు. ఎన్నికల సరళిని గమనిస్తే... పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పోలింగ్ శాతం మాత్రం ఆశాజనకంగానే ఉంటోంది. ఎన్నికల సంఘం తీసుకునే చర్యలు ఇందుకు ఉపయోగపడుతున్నాయి. ఓటర్లను చైతన్య పర్చేందుకు ఈ సారి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా... పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపరిచారు. వృద్ధులు - గర్భిణులు - వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు ఎలక్షన్ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు.
Tags:    

Similar News