రూ. 70 కోట్ల‌కు బిల్లులు చూప‌లేక‌పోయారు..!

Update: 2016-12-27 11:26 GMT
ఎయిడ్స్‌ వ్యాధికి నివార‌ణ ఒక్క‌టే మార్గం.. మందు లేదు అంటారు! అలాగే - ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన నిధుల‌కు ఖ‌ర్చులు మాత్ర‌మే ఉంటాయి - బిల్లులు ఉండ‌వు అనేట్టుగా ప‌రిస్థితి మారింది. రూ. 70 కోట్ల కుంభకోణంలో ఇరుక్కుంది తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ ఇచ్చిన నిధుల‌ను రాష్ట్ర స్థాయి అధికారులు హామ్ ఫ‌ట్ అని మాయం చేశారు. లెక్క‌లు అడిగేస‌రికి బిక్క‌ముఖాలేసి దిక్కులు చూస్తున్నారు. గ‌డ‌చిన రెండు ఆర్థిక సంవ‌త్స‌రాలకి ఇచ్చిన నిధులలో రూ. 70 కోట్లు ఎలా ఖ‌ర్చాయ్యాయో... ఎందుకు ఖ‌ర్చు అయ్యాయో అనేది బిల్లులు చూప‌లేక‌పోయారు. ఈ వైన‌మంతా ఢిల్లీలో జ‌రిగిన ఓ స‌మావేశంలో బ‌య‌ట‌ప‌డింది. నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఓ ఉన్న‌త స్థాయి సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి సొసైటీ అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ మీటింగ్ లోనే ఈ స్కామ్ బ‌య‌ట‌ప‌డటం విశేషం.

గ‌డ‌చిన రెండు సంవ‌త్స‌రాల్లో సొసైటీ పెట్టిన ఖ‌ర్చుల గురించి అడ‌గ్గానే అధికారులు తెల్ల‌ముఖం వేశార‌ట‌. బిల్లులు కూడా చూప‌లేక‌పోయార‌ట‌. దీంతో ఈ మొత్తం వ్య‌వ‌హారంపై వెంట‌నే ద‌ర్యాప్తు జ‌రిపిస్తామ‌ని, ఈ సొమ్మును స్వాహా చేసిన‌వారి నుంచి క‌క్కిస్తామ‌ని తెలంగాణ ఆరోగ్య - కుటుంబ సంక్షేమ క‌మిష‌న‌ర్ వాకాటి కరుణ చెప్పారు.

ఈ సొసైటీకి ఎయిడ్స్ నివార‌ణ చ‌ర్య‌ల‌కు గానూ 2014 ఆగ‌స్టు నుంచి 2015 డిసెంబ‌ర్ వ‌ర‌కు రూ. 113 కోట్లు మంజూరు చేశారు. అంటే, రాష్ట్ర స్థాయిలో చేప‌ట్టాల్సిన అన్ని ర‌కాల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే సొమ్ముతోపాటు - కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు కూడా ఈ నిధుల నుంచే ఇవ్వాలి. ఈ నిధుల నుంచే రూ. 70 కోట్లు మాయం అయ్యాయి. ఎలా మాయం అయ్యాయో అధికారుల‌కు తెలియ‌క‌పోవ‌డం విశేషం!

నిధుల స్వాహా వెన‌క బినామీ ఎన్జీవోల హ‌స్తం ఉందేమో అనే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. హైద‌రాబాద్‌ - సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో 178 ఈ త‌ర‌హా ఎన్జీవోలు ఉన్నాయి! వాటిలో 58 ఎన్జీవోలు సొసైటీతో క‌లిసి చేస్తున్నాయి. ఈ ఎన్జీవోల విష‌యంలోనే ఏదో గోల్ మాల్ జ‌రిగి ఉంటుంద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డే అధికారులు చేతివాటం చూపి ఉంటారని అనుమానం! మొత్తానికి ఆ రూ. 70 కోట్లూ ఎలా స్వాహా అయ్యాయో అనేది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News