సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా @ హైదరాబాద్..!

Update: 2016-11-06 05:12 GMT
భారత ఐటీ రాజధాని అంటే వెంటనే చెప్పే పేరు బెంగళూరు. అవును... భారతదేశంలో ఐటీ హబ్ అంటే ముందుగా చెప్పే బెంగళూరు కు ఆ ఖ్యాతి గతవైభవం కాబోతుందనే సంకేతాలు వస్తున్నాయి!! ఇప్పటికే ఆ నగరానికి పోటీ ఇస్తూ హైదరాబాద్ ముందుకెళ్తుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకులు భవిష్యత్తులో దేశంలోని టాప్ ఐటీ హబ్ హైదరాబాద్ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ ర్యాంకులు ప్రస్తుతం కర్ణాటక - ఏపీ - తెలంగాణల్లోని పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం...

కేంద్ర వాణిజ్య శాఖ - ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటక 13 స్థానానికి పడిపోయింది. గత ఏడాది వెల్లడించిన ర్యాంకుల్లో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ - 2 వస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లు మొదటిస్థానానికి చేరుకోగా... గతేడాది 9వ స్థానంలో నిలిచిన కర్ణాటక మాత్రం నాలుగు స్థానాలు దిగజారడం గమనార్హం. దీనికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల భారీగా పెరిగిన అవినీతి - తద్వారా సంస్థలకు అనుమతులు మంజూరుచేయడంలో నెలకొన్న జాప్యం తదితర అంశాలు కారణాలుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయాలపై స్పందించిన కర్ణాటక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఆర్.వి.దేశ్ పాండే... ఈవోడీబీ ర్యాంకుల్లో తమ రాష్ట్రం అధమస్థాయికి పడిపోయినమాట వాస్తవమేనని.. అయితే ఐటీ పెట్టుబడుల ఆకర్షణలో ఇప్పటికీ బెంగళూరు నగరానిదే పైచేయి అని మరువొద్దని చెప్పుకుంటున్నారు. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు తమ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కర్ణాటక కంటే చాలా దూరంలో ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈవోడీబీ ర్యాంకుల విధానంపై అనేక అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం.

ఇక హైదరాబాద్ తో పోటీ విషయానికొస్తే... టీ-హబ్ తరహా ఏర్పాట్లతో ఇక్కడ ఔత్సాహికులను బాగానే ప్రోత్సహిస్తుండగా.. కర్ణాటకలో మాత్రం చిన్న తరహా వ్యాపారాలకు అనుమతులు లభించడం కష్టంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో బెంగళూరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగ్గా పనిచేస్తే "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అడ్రస్ హైదరాబాద్ కు మారడం ఎంతోదూరంలో లేదని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈవోడీబీ ర్యాంకుల వివరాలు...

ర్యాంక్ - రాష్ట్రం

1 - ఆంధ్రప్రదేశ్

1 - తెలంగాణ

3 - గుజరాత్

4 - ఛత్తిస్ ఘర్

5 - మధ్య ప్రదేశ్

6 - హర్యానా

7 - జార్ఖాండ్

8 - రాజస్థాన్

9 - ఉత్తరాఖాండ్

10 - మహారాష్ట్ర

11 - ఇడిశా

12 - పంజాబ్

13 - కర్ణాటక

14 - ఉత్తరప్రదేశ్

15 - పశ్చిమ బెంగాల్

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News