తెలుగు అకాడమీ కుంభకోణం..నివేదిక ఇచ్చిన త్రిసభ్య కమిటీ , ఏముందంటే

Update: 2021-10-06 05:47 GMT
తెలుగు అకాడమీ నిధుల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. తెలుగు అకాడమీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధులను విత్ డ్రా చేసిన వ్యవహారంపై ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి నేతృత్వం వహించిన తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు నివేదిక సమర్పించారు. బ్యాంకుల్లో అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గల్లంతుపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు అకాడమీలోని అంతర్గత లోపాలపై విచారణ జరిపేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.

అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి సహా అధికారులు, సిబ్బందిని, బ్యాంకు అధికారులను కమిటీ విచారించింది. ఈ వ్యవహారంపై ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల నిర్వహణలో శాఖాపరమైన నిర్లక్ష్యం జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం, అకౌంట్స్ విభాగం, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాలు జరిగాయని కమిటీ నిర్థారించినట్లు తెలుస్తోంది.

అకాడమీ డిపాజిట్ల గోల్‌ మాల్‌ కేసులో యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి నాంపల్లి కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మరో ముగ్గురు నిందితులు సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్‌ల కస్టడీపై తీర్పును కోర్టు గురువారానికి వాయిదా వేసింది. మస్తాన్ వలీని రేపటి నుంచి కస్టడీలోకి తీసుకొని 6 రోజుల పాటు సీసీఎస్ పోలీసులు ప్రశ్నించనున్నారు. తెలుగు అకాడమీకి సంబంధించిన రూ.63 కోట్ల డిపాజిట్లు బ్యాంకుల నుంచి దారి మళ్లించారు. యూబీఐ బ్యాంకుకు చెందిన కార్వాన్, సంతోష్ నగర్ శాఖల్లో తెలుగు అకాడమీకి చెందిన రూ. 53 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిట్లను ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి నగదును విత్ డ్రా చేశారు.

తెలుగు అకాడమీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు ప్రధాన నిందితుడు మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌ లను అరెస్ట్ చేశారు. యూనియన్ బ్యాంకు నుంచి డిపాజిట్లను ఏ విధంగా మళ్లించారో విచారించేందుకు నలుగురు నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి న్యాయస్థానాన్ని కోరారు. డిపాజిట్ల గల్లంతులో ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలపై విచారణ కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మస్తాన్ వలీని ఆరు రోజుల కస్టడీకి కోర్టు అంగీకరించింది. యూబీఐతో పాటు చందానగర్‌ లోని కెనరా బ్యాంకులోనూ రూ.10 కోట్ల డిపాజిట్లను ఏపీ మర్కంటైల్ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లోని నిధులను ఒకే ముఠా గోల్‌ మాల్‌ చేసిందా, ఇంకెవ్వరైనా కీలక పాత్ర పోషించారా అనే కోణంలో మస్తాన్ వలీని పోలీసులు ప్రశ్నించనున్నారు.


Tags:    

Similar News