ఈసారి కేసీఆర్ ప్రెస్ మీట్ ఎంత స్పైసీగా ఉంటుందంటే?

Update: 2020-05-13 13:05 GMT
మిగిలిన సమయాల్లో ఎన్ని పంచాయితీలున్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలు.. ఇటీవల కాలంలో ప్రపంచంలోని తెలుగువారంతా అలా గుడ్లప్పగిస్తూ చూస్తుండిపోవటం ఎక్కువైంది. అదెంత ఎక్కువైందంటే.. టీఆర్ఎస్ నేతలు సైతం.. మా సారు ప్రెస్ మీట్ ను దేశ విదేశాల్లోని తెలుగువారంతా తెగ చూసేస్తున్నారని చెప్పేసుకుంటున్నారు. మీడియా మీట్ ఎంతసేపు సాగినా.. లైవ్ ఇచ్చేయటం.. దానికి తగ్గట్లే.. ఆ సమయంలో మరే చానల్ లో వచ్చే ప్రోగ్రామ్ ను చూడకుండా సారు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వింటున్న తెలుగోళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తన మాటల్లో ఎంతకూ లొంగని మాయదారి రోగం గురించి మాత్రమే కాదు.. తనను విమర్శించే విపక్షాలు.. తనను తప్పు పట్టే మీడియాతో పాటు.. కేంద్రంలోని మోడీ సర్కారుపైనా పంచ్ లు వేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. లాక్ డౌన్ 3.0 ముగిసి.. 4.0కు తెర లేస్తున్న వేళ.. కేసీఆర్ మీడియా సమావేశం ఎప్పుడన్న ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈసారి మీడియా సమావేశంలో కేసీఆర్ నోట ఘాటు పంచ్ లు తప్పవంటున్నారు. ప్రధాని మోడీ ప్రకటించే రూ.20లక్షల ప్యాకేజీలో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా లేకుంటే కేంద్రానికి తలంటు కార్యక్రమం తప్పదంటున్నారు. అంతేకాదు.. ఏపీ సర్కారు షురూ చేసిన ఎత్తిపోతల పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న వేళ.. తన కమిట్ మెంట్ ను శంకించే వారికి షాకిచ్చేలా వ్యాఖ్యలు చేయటమే కాదు.. ఈ సందర్భంగా వలసపాలకులు అంటూ గత ప్రభుత్వాలపై నిప్పులు చెరగటం ఖాయమంటున్నారు. పనిలో పనిగా.. కొన్ని మీడియా సంస్థలపైనా చురకలు వేసే అవకాశం లేకపోలేదు. మొత్తంగా చూస్తే.. ఈసారి సారు ప్రెస్ మీట్ మరింత స్పెసీగా ఉండటం ఖాయం.
Tags:    

Similar News