అమెరికాలో తెలుగోళ్లు సృష్టించిన రికార్డ్ ఇది

Update: 2018-09-21 06:41 GMT
త‌మ నైపుణ్యాల‌తో అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌న తెలుగు వాళ్లు స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు తెలుగు రాష్ర్టాల‌తో స‌హా తెలుగు బిడ్డ‌లు అమెరికాలో మెజార్టీ సంఖ్య‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇలా మ‌న‌వాళ్లంద‌రి లెక్క కొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలో జ‌రిగిన ఓ స‌ర్వేలో మొత్తం భార‌తీయుల్లో మూడో వంతు తెలుగు భాష మాట్లాడేవారున్నార‌ని తేలింది. స‌హ‌జంగానే భార‌తీయ భాష‌ల్లో హిందీ అగ్ర‌స్థానంలో ఉంది.అమెరికాలో ఉన్న భార‌తీయుల్లో  హిందీ - గుజ‌రాతీ మాట్లాడే వారు ఒక‌టి రెండో స్థానాల్లో ఉండ‌గా...తెలుగు భాష మాట్లాడే వారు మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా కమ్యూనిటీ స‌ర్వే ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

2017లో జ‌రిగిన ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను యూఎస్ సెన్స‌స్ బ్యూరో తాజాగా విడుద‌ల చేసింది. జూన్‌1 - 2017 నాటికి అమెరికా మొత్తం జ‌నాభా 30.5 కోట్ల‌లో 6.7 కోట్ల మంది త‌మ ఇంట్లో విదేశీ భాష మాట్లాడుతార‌ట‌. ఈ విదేశీ భాష‌ల్లో భార‌తీయుల విష‌యానికి వ‌స్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య‌8.63 ల‌క్ష‌లు ఉండ‌గా - 4.34 ల‌క్ష‌ల మంది గుజ‌రాతీ భాష మాట్లాడే వారు 4.15 ల‌క్ష‌ల‌మంది తెలుగు మాట్లాడే వారున్నారు. 2010 నుంచి దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింద‌ని పేర్కొంది. హిందీ 42% - గుజ‌రాతీ 22% పెర‌గ‌గా...తెలుగు మాట్లాడే వారి సంఖ్య 86% పెరిగింద‌ని వివ‌రించింది. అయితే, మొత్తం భార‌తీయుల్లో హిందీ మాట్లాడే వారి సంఖ్య 33% ఉంద‌ని - 17% మంది గుజ‌రాతీ - తెలుగు మాట్లాడ‌గ‌ల‌ర‌ని వెల్ల‌డించింది.

కాగా, 2001 నుంచి లెక్క‌ల‌ను గ‌మ‌నిస్తే - అమెరికా ఇస్తున్న మొత్తం హెచ్‌1బీ వీసాల్లో 50 శాతం భార‌తీయుల‌కే ద‌క్కుతున్నాయని పేర్కొంది.  అమెరికాలో నివసిస్తున్న వారిని - వారి కుటుంబాలు కూడా క‌లుపుకొని లెక్కేస్తే దాదాపు ఒక‌ మిలియ‌న్ జ‌నాభా తెలుగు వారే ఉంటార‌ని అందుకే ఇంత పెద్ద ఎత్తున తెలుగు భాష వృద్ధి చెందింద‌ని ఈ నివేదిక‌పై ప‌లువురు ఎన్నారైలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. స‌హజంగానే అమెరికాలో నివ‌సిస్తున్న వారిలో ఎక్కువ‌మంది టెక్నాల‌జీ ఆధారిత ఉద్యోగాల పైనే ఆధార‌ప‌డ్డార‌ని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News