తెలుగు నేల‌కు అమిత్ షా శుభవార్త చెబుతారా?

Update: 2018-01-31 07:49 GMT
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత ఇటు న‌వ్యాంధ్ర‌లోనే కాకుండా అటు కొత్త‌గా ఏర్పాటైన తెలంగాణ‌లోనూ రాజ‌కీయ పార్టీల‌కు స‌రిప‌డిన‌న్ని సీట్లు లేని కార‌ణంగా నానా ఇబ్బందులు ప‌డుతున్నాయి. దీనికి తోడు రెండు రాష్ట్రాల్లో నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ - టీఆర్ ఎస్‌ లు పార్టీ ఫిరాయింపుల‌కు గేట్లు ఎత్తేసి అవ‌కాశ‌మున్న ప్ర‌తి ఎమ్మెల్యే - ఎంపీ - ఎమ్మెల్సీల‌కు కండువాలు క‌ప్పేశాయి. అస‌లే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అప్ప‌టికే పార్టీలో ఉన్న నేత‌ల‌ను సంతృప్తిప‌ర‌చ‌డం ఇటు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో పాటుగా అటు టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల‌కు చుక్క‌లు క‌నిపించాయ‌నే చెప్పాలి. అయితే విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న  ఒకే ఒక్క అంశాన్ని వీల‌యిన‌న్ని సార్లు ప్ర‌యోగించిన ఇద్ద‌రు చంద్రులు అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే చెప్పాలి. అయితే ఆ త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంతో పాటుగా పార్టీలో అవ‌కాశం కోసం కాసుక్కూర్చున్న నేత‌ల‌ను సంతృప్తిప‌ర‌చాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా అసెంబ్లీ సీట్లు పెర‌గాల్సిందే. సీట్ల సంఖ్య పెరిగితే స‌రేస‌రి... లేనిప‌క్షంలో ఇద్ద‌రు చంద్రుల‌కు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇదే విష‌యాన్ని కాస్తంత ముందుగానే గ్ర‌హించిన ఇద్ద‌రు చంద్రుళ్లు అసెంబ్లీ సీట్ల పెంపున‌కు సంబంధించి సానుకూలంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఇప్ప‌టికే కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారుకు ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే సీట్ల పెంపుతో త‌మ‌కేంటీ లాభం అన్న చందంగా వ్య‌వ‌హ‌రించిన బీజేపీ అధిష్ఠానం సీట్ల పెంపును దాదాపుగా ప‌క్క‌న‌పెట్టేసింద‌నే చెప్పాలి. అయితే ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ... కేంద్రం స్థాయిలో తెలుగు నేల‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపున‌కు సంబంధించి స‌డెన్‌గా క‌ద‌లిక వ‌చ్చేసింది. ఇందుకు నిద‌ర్శ‌నంగా తెలుగు నేల‌కు చెందిన బీజేపీ నేత‌లు ఉన్న‌ప‌ళంగా ఢిల్లీ రావాల‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. ఈ పిలుపుతో ఏపీలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు - విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు - ఏపీ అసెంబ్లీ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు... తెలంగాణ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌ - మాజీ అధ్య‌క్షుడు జి. కిష‌న్ రెడ్డి - కేంద్ర మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌లు నేటి సాయంత్రం హ‌స్తినకు బ‌య‌లుదేర‌నున్నారు. రేపు అమిత్ షా త‌న నివాసంలో తెలుగు నేల నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం.

సీట్ల పెంపున‌కు సంబంధించి కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చిన నేప‌థ్యంలో ఆది నుంచి ఏపీ కోరుతున్న‌ట్లుగా విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ - ఏపీ హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాల‌పైనా అమిత్ షా ఈ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలున్న‌ట్లుగా స‌మాచారం. మొత్తానికి కేంద్రంలో చాలా ఆల‌స్యంగానైనా వ‌చ్చిన ఈ త‌ర‌హా స్పంద‌న‌... ఇద్ద‌రు చంద్రుళ్ల‌ను సంతోషంలోనే ముంచేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపును వాయిదా వేస్తూ వ‌స్తున్న బీజేపీ స‌ర్కారు.. ఈ ద‌ఫా ఆ పార్టీ అధ్య‌క్షుడు నిర్వ‌హించ‌నున్న భేటీలో ఈ దిశ‌గా నిర్ణ‌యం తీసుకోకుంటే మాత్రం... ఇక ఆ ఫైలు అట‌కెక్కిన‌ట్లుగానే ప‌రిగ‌ణించాల్సి వస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తానికి ఒక్క పిలుపుతో అమిత్ షా తెలుగు నేల రాజ‌కీయాల‌ను ఆస‌క్తిక‌రంగా మార్చేశార‌ని చెప్పాలి. చూద్దాం... రేప‌టి భేటీలో ఆయ‌న ఏ త‌ర‌హా నిర్ణ‌యాలు తీసుకుంటారో?

Tags:    

Similar News