ఆ విషయంలో తెలుగోళ్లను కొట్టే వారే లేరంట

Update: 2016-12-06 03:24 GMT
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రప్రభుత్వం క్యాష్ లెస్ లావాదేవీల గురించి మాట్లాడుతోంది. అయితే.. ఈ విషయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగురాష్ట్రాలు ముందంజలో ఉన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ-లావాదేవీల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా దూసుకెళ్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని మేటి రాష్ట్రాలుగా పేరున్న రాష్ట్రాలకు మించి.. ఈ లావాదేవీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు మించిన రాష్ట్రం మరొకటి లేదన్నది తాజాగా చేసిన అధ్యయనం తేల్చింది.

పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నప్పటికీ.. ఈ విషయంలో ఏపీ.. తెలంగాణలు ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి డిసెంబరు వరకూ జరిపిన ఈ లావాదేవీల్లో ఏపీ తొలిస్థానంలో నిలవగా.. తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో నిలవటం విశేషం. పెద్దనోట్ల రద్దు ముందు నుంచి ఈ-లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నా.. నోట్ల రద్దు అనంతరం ఈ జోరు మరికాస్త పెరిగిందని చెప్పాలి.

ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి డిసెంబరు 5 వరకూ చూస్తే.. 99.62కోట్ల లావాదేవీలు ఏపీలో జరిగి నెంబర్ స్థానంలో నిలవగా..  తెలంగాణలో 73.64కోట్ల లావాదేవీలతో రెండోస్థానంలో నిలవటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మరో నాలుగైదు రోజుల్లో వంద కోట్ల లావాదేవీలు పూర్తి చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ అవతరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

నగదురహితానికి పెద్దపీట వేయాలని కేంద్రం భావిస్తున్న వేళ.. ఆ దిశగా మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉండటం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంతోషాన్నిస్తుందనటంలోసందేహం లేదు. నగదు రహిత లావాదేవీలు ఈ మధ్యన తెలంగాణలోనూ జోరందుకున్నాయి.పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇది మరింత పుంజుకుందని చెప్పాలి. డిసెంబరు1 తేదీన ఒక్కరోజునే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 17 లక్షల ఈ-లావాదేవీలు జరగ్గా.. ఏపీలో మాత్రం అదే రోజు 7లక్షల లావాదేవీలు మాత్రమే జరగటం గమనార్హం. అయితే.. దీనికి కారణం హైదరాబాద్ మహానగరమేనని చెప్పక తప్పదు. తెలంగాణలో భారీగా జరిగిన లావాదేవీల్లో హైదరాబాద్ వాటానే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా.. సంపన్న రాష్ట్రాలుగా పేరున్న గుజరాత్.. కేరళ.. ఎంపీ.. తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ-లావాదేవీల విషయంలో వెనకబడి ఉండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News