టీ కాంగ్రెస్‌ లో పీసీసీ చీఫ్ ఎంపిక.. టెన్ష‌న్.. టెన్ష‌న్‌..!!

Update: 2020-12-10 03:51 GMT
ఇప్ప‌టికే అస్త‌వ్య‌స్తంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ ఎంపిక వివాదం మ‌రిన్ని మ‌లుపులు, గంద‌ర‌గోళాల‌కు కార‌ణం కానుందా?  పార్టీ మ‌రింత బ‌ల‌హీన ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2012లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ చీఫ్‌గా రాహుల్ గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా పేరున్న కెప్టెన్ ఉత్త‌మ్ కుమా ర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో పార్టీ పుంజుకుంటుంద‌ని, రెడ్డిసామాజిక వ‌ర్గాన్ని ఐక్యం చేస్తార‌ని అధిష్టానం చాలా నే ఆశాలు పెట్టుకుం ది. దీనికి రాహుల్ మ‌ద్ద‌తుకూడా క‌లిసి రావ‌డంతో ఉత్త‌మ్‌కు తిరుగులేకుండా పోయింది.  

ఉత్త‌మ్ ఆధ్వ‌ర్యంలో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నిక‌లు, రెండు సార్లు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు, అదేస‌మ‌యంలో 2016లోనే ఖ‌మ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక, ఇటీవ‌ల దుబ్బాక ఉప ఎన్నికల‌ను కాంగ్రెస్ ఎదుర్కొంది. అయితే.. ఉత్త‌మ్ అడుగు పెట్టిన ముహూర్త‌మో.. లేదా.. ఆయ‌నలో పార్టీని న‌డిపించే నైపుణ్యం లేక‌పోవ‌డ‌మో తెలియ‌దుకానీ.. నానాటికీ తీసిక‌ట్టుగా మారింది పార్టీ ప‌రిస్తితి. పాలేరులో 2016లో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో సిట్టింగ్ కాంగ్రెస్ అభ్య‌ర్థి మృతిచెందినా.. ఆ సీటును గెలిపించుకోలేక పోయారు. ఇక‌, త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌లోకి జంప్ చేసి విలీనం అయిపోయినా.. చేష్ట‌లుడిగి చూస్తూ ఉండిపోయారు.

ఇక‌, ఇటీవ‌ల గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆయ‌నే స్వ‌యంగా ప‌ద‌విని వ‌దులుకున్నారు. ద‌రిమిలా ఇప్పుడు పీసీసీ చీఫ్‌ను ఎన్నుకొవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. పీసీసీ చీఫ్ రేసులో రెడ్డి సామాజిక వ‌ర్గ‌మే పోటీ ప‌డుతున్నా.. చిత్ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పార్టీలో క‌ష్టించి ప‌నిచేశామంటూ కొంద‌రు.. పార్టీని న‌డిపించే యువ శ‌క్తులు మేమ‌ని కొంద‌రు పోటీకి సిద్ధ‌మ‌య్యారు. ఈ రేసులో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, రేవంత్ రెడ్డిల మ‌ధ్య భీక‌ర‌మైన పోరు సాగుతోంది. టీడీపీ నుంచి జంప్ చేసి వ‌చ్చిన రేవంత్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ఉన్నారు. కానీ, కాంగ్రెస్ సీనియ‌ర్ల‌తో పోల్చుకుంటే.. ఈయ‌న వ‌చ్చి చాలా త‌క్కువ కాల‌మే అవుతోంది.

ఇక‌, కోమ‌టిరెడ్డి.. జ‌గ్గారెడ్డి కూడా ఈ ప‌ద‌వికి పోటీ ప‌డుతుండ‌డం, వారు కూడా త‌మ త‌మ స్థాయిలో ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకోవ‌డం క‌లిసి వ‌స్తున్నా.. యువ‌త‌ను బాగా ఆక‌ర్షించేందుకు రేవంత్ అయితే.. బాగుంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో అధిష్టానం రేవంత్‌వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం ఊపందుకుంది. ఇదే జ‌రిగితే.. త‌మ దారి తాము చూసుకునేందుకు సీనియ‌ర్లు రెడీగా ఉండ‌డం పార్టీని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీ, అధికార ప‌క్షం టీఆర్ ఎస్ కూడా కాంగ్రెస్‌లో చోటు చేసుకునే ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌మ‌కు అన్యాయం జ‌రిగితే.. నాయ‌కులు ఈ రెండు పార్టీల్లో త‌మ‌కు న‌చ్చిన వాటిలో చేరిపోయే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. రేవంత్ వ‌స్తే.. వ్య‌క్తిగ‌తంగా త‌న ఇమేజ్‌ను పెంచుకుని.. పార్టీని తిరిగి నెంబ‌ర్ 2 చేస్తార‌నే ప్ర‌చారం ఉంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర ద్వారా.. కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీగా మార్చార‌నే పేరు రావ‌డాన్ని ఇప్పుడు కొంద‌రు ప్ర‌స్తావిస్తున్నారు. ఇలా.. ఒక్క పీసీసీ ప‌ద‌వి.. పార్టీ మొత్తాన్ని శాసించే ప‌రిస్థితి ఎదురైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈవిష‌యంలో కాంగ్రెస్ నేత‌లు ఎలా ముందుకు వెళ్తారో.. పార్టీ ప‌రిస్తితి ఏమ‌వుతుందో చూడాలి.
Tags:    

Similar News