ఆ ఎమ్మెల్యేకు పుత్ర‌ర‌త్నాల ఎఫెక్ట్.. టీఆర్ ఎస్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్

Update: 2022-01-15 02:30 GMT
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న స‌మ‌యంలో పార్టీలో కొంద‌రు నేత‌లు చేస్తున్న ప‌నులు తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా కొంద‌రు ఎమ్మెల్యేల పుత్ర‌ర‌త్నాలు చేస్తున్న వ్య‌వ‌హారాలు పార్టీలో ఇబ్బందిగా మారాయి. సీఎం కేసీఆర్ మంచిత‌న‌మో..లేక‌.. ఆయ‌న చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరను అలుసుగా తీసుకుంటున్నారో తెలియ‌దు కానీ.. కొంద‌రు నాయ‌కుల సుపుత్రులు మాత్రం రెచ్చిపోతున్నా రు. ఫ‌లితంగా పార్టీలో ఇప్పుడు వీరి వ్య‌వ‌హారం.. తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇలాంటివారివ‌ల్ల పార్టీకి ఇబ్బందులే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం ఏంట‌నేది చ‌ర్చ‌గా మారింది.

వ‌న‌మా వ్య‌వ‌హారంతో..
ఇటీవ‌ల కాలంలో వ‌న‌మా సుపుత్రుడి వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నంగా మారింది. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ నుంచి గెలిచిన వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు చేసిన నిర్వాకంతో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం..త‌ర్వాత వ‌రుస‌గా.. ఏం జ‌రిగింద‌నే విష‌యంపై సెల్ఫీ వీడియోలు బాధితులు నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో  టీఆర్ఎస్ తీవ్ర ఇర‌కాటంలో ప‌డిపోయింంది. ఈ అంశంపై విపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి.

దీంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యే వనమాతో పాటు  టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. అప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌లు తీసుకుని వ‌న‌మాను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే ప‌రిస్థితి వ‌చ్చినా.. పార్టీపై మ‌చ్చ‌మాత్రం అలానే ఉండిపోయింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. చివర కు వనమా సైతం తన కుమారుణ్ని నియోజకవర్గంలో ఉంచనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక‌, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు జీవన్ లాల్ వ్యవహార శైలి ఆ నియోజకవర్గంలో నెగిటివ్ చర్చకు దారితీస్తోంది. అదేవిధంగా ఒక కీల‌క‌ మంత్రి కుమారుడు కూడా తండ్రి ఇమేజ్‌ను అడ్డు పెట్టుకుని దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. మ‌రికొన్ని ఆరోప‌ణ‌లు రావ‌డం తెలిసిందే.

మ‌రోవైపు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనేక నియోజకవర్గాల్లో తనయుల వ్యవహారాలు తండ్రులకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి, మరోవైపు పుత్రరత్నాలు చేస్తున్న పనులు వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. వారసుల ఆగడాలు, స్వీయ తప్పిదాలు వారి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వీరిని ప‌క్క‌న పెట్టేయాల‌ని పార్టీ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. కొంద‌రి కోసం.. పార్టీని బ‌లిచేసే ప‌రిస్థితి లేద‌ని.. కేసీఆర్ సంకేతాలు పంపుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News