అయ్యో ఎంత దారుణం.. కర్నూలు జిల్లాలో చిన్నారుల్ని చిదిమేసిన లారీ

Update: 2020-12-15 03:56 GMT
ఘోర రోడ్డు ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. గడిచిన నాలుగైదురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన యాక్సిడెంట్లు వరుస పెట్టి జరుగుతున్నాయి. తాజాగా అలాంటి విషాదమే ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ దారుణ రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు ఘటనా స్థలంలోనే చనిపోగా.. మరోఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి మీద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద నలబై మంది చర్చికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు.ఈ సమయంలో వేగంగాదూసుకొచ్చిన ఐషర్ లారీ వారిని ఢీ కొంది. దీంతో.. అక్కడికక్కడే పదేళ్ల సురేఖ.. పదకొండేళ్ల ఝూన్సీ.. పన్నెండేళ్ల వంశీ.. మరో చిన్నారి హర్షను గుర్తించారు. మరో ఏడుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

ఇంత దారుణ ప్రమాదం జరిగిన తర్వాత.. లారీని ఆపేయకుండా తప్పించుకునేందుకు సదరు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో.. స్థానికులు వెంటపడి ఆళ్లగడ్డ సమీపంలోని బత్తులూరు వద్ద అతన్ని పట్టుకున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పొద్దుపొద్దున్నే చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది.
Tags:    

Similar News