ప్రవక్తపై కామెంట్స్:నూపూర్ శర్మను చంపేస్తామని అల్ ఖైదా హెచ్చరిక

Update: 2022-06-09 02:30 GMT
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆమె వ్యాఖ్యలు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు ముస్లిం దేశాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి భారత రాయబారులకు సమన్లు జారీ చేశాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం దేశాలు నిరసన తెలిపాయి.

తాజాగా ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా కూడా ఈ జాబితాలో చేరింది. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని.. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని అల్ కాయిదా హెచ్చరికలు జారీ చేసింది.అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామని హెచ్చరించింది.

ఈ మేరకు అల్ ఖైదా ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖను విడుదల చేసి దుమారం రేపింది. మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకొని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, యూపీ, ముంబై, గుజరాత్ లోని కాషాయ వాదులూ.. చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి' అని అల్ ఖైదా పేరిట హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక మరో ఉగ్రసంస్థ ఎంజీహెచ్ సైతం ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను నూపూర్ శర్మ క్షమాపణ చెప్పాలని.. లేకుంటే ఏం చేయాలో అది చేస్తాం అంటూ ఆమెను హెచ్చరించారు. ఈ మేరకు ప్రకటన చేశారు.

-అసలేంటి వివాదం
యూపీలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై ఓ టీవీచానెల్ చర్చలో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ పాల్గొన్నారు. తీవ్ర ఆగ్రహావేశాలతో మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన , అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఈ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా,కువైట్, ఇరాన్, ఖతార్ వంటి దేశాల నుంచి నుపూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భారత రాయబారులకు నోటీసులు పంపించారు. కొన్ని దేశాల్లో భారత ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్లు చేశారు.

దీంతో బీజేపీ వెంటనే నుపూర్ శర్మను బీజేపీ నుంచి బహిష్కరించింది. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారత్ అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపింది. అయినా ఈ వివాదం ఇంకా సమసిపోలేదు. ఉగ్రవాద సంస్థలు సైతం నుపూర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు పంపుతున్నాయి.
Tags:    

Similar News