ప్రధాని పదవికి పోటీపడుతూ బిడ్డకు జన్మనిచ్చింది

Update: 2023-05-02 06:00 GMT
ఇదో అరుదైన సందర్భం.. ఎన్నికలకు ముందు ప్రధాని పదవికి పోటీపడుతున్న మహిళ బిడ్డను ప్రసవించింది. థాయ్ లాండ్ లో ప్రధాని పదవికి పోటీపడుతున్న పేటోంగ్టార్స్ షినవత్రా ఈతాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మరో రెండు వారాల్లోనే ఎన్నికలు ఉన్నాయనగా ఆమె డెలివరీ చోటుచేసుకుంది.

థాయ్ లాండ్ లో రెండు వారాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఫలితాల్లో తదుపరి ప్రధాని ఎవరో తేలనున్నారు. ఈ సమయంలో పీఎం పోస్టుకు గట్టి పోటీ ఇస్తోన్న పేటోంగ్టార్న్ షినవత్రా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని  ఆమె దేశ ప్రజలకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

థాయ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్రా చిన్న కుమార్తె ఈమె. 15 ఏళ్ల క్రితం ఆమె తండ్రి స్థాపించిన ప్యూథాయ్ పార్టీ తరుఫున ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఎన్నికల రేసులో ఈమెనే ముందు ఉన్నారని.. ప్రధాని అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. షినవత్రా పేరే ఆమెకు కలిసి వస్తుందని.. ఆమె తండ్రి మంచి పనులే గెలిపిస్తాయని అంటున్నారు.

షినవత్ర కుటుంబానికి ఉత్తర, ఈశాన్య థాయ్ లాండ్ గ్రామీణ ఓటర్ల మద్దతు ఉంది. రెండు వారాల్లో ఎన్నికలు జరుగనుండగా.. ఆమె బిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నిండు గర్భిణిగా ఉన్న సమయంలోనే ఆమె ఊరూరా తిరగకుండా వీడియో కాల్స్ ద్వారా  ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం. మద్దతుదారులతో మాట్లాడుతూ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కేవలం 36 సంవత్సరాల ఈమె పార్టీని గర్భంతోనే నడపడం.. తాజాగా బిడ్డను కని ప్రచారాన్ని కొనసాగిస్తానని చెప్పడం విశేషం.

థాయ్ లాండ్ కు ఈమె తండ్రి తక్షిన్ షినవత్రా 2001-2006 వరకూ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సోదరి ఇంగ్లక్ షినవత్రా 2011-2014 వరకూ ప్రధానిగా ఉన్నారు. వీరిద్దరూ థాయ్ సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. తమపై నమోదైన అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ఈ ఇద్దరు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. విదేశాల్లో ఉన్న తక్షిణ్ ప్రస్తుతం స్వదేశానికి రావాలని భావిస్తున్నారు.

Similar News