వైసీపీకి తగ్గని 'మండలి' తలనొప్పి!

Update: 2020-12-03 06:25 GMT
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీ సాధించి ఏకంగా  151 సీట్లు కైవసం చేసుకుంది. ప్రతిపక్ష టీడీపీ 23 సీట్లకే పరిమితం కావడంతో అసెంబ్లీలో అధికార పార్టీకి తిరుగులేకుండా పోతోంది. సభ నిర్వహణలో  కానీ,  బిల్లుల ఆమోదంలో కానీ వైసీపీ  దూసుకుపోతోంది. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ ఆడిందే ఆటగా సాగుతోంది. అయితే శాసనమండలి విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా రివర్స్ గా మారింది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. మండలిలో అధికార వైసీపీకి 11 మంది సభ్యులు ఉండగా ప్రతిపక్ష టీడీపీ ఏకంగా 30 మంది ఉన్నారు. దీంతో మండలికి వస్తున్న బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం ముప్పతిప్పలు పడుతోంది. మండలికి వస్తున్న ప్రతి  బిల్లు ఆమోదానికి నోచుకోక  వెనక్కి తిరిగి వస్తోంది. ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

 ఈ ఏడాది జనవరిలో కీలకమైన మూడు రాజధానులు బిల్లు ను మండలికి పంపగా టీడీపీ సభ్యులు అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపారు. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కమిషన్, విభజన బిల్లులను మండలి అడ్డుకుంది.  ప్రభుత్వ నిర్ణయాలను శాసనమండలి అడ్డుకుంటోందని, అసలు ఆ వ్యవస్థను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం  ఈ మేరకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ శాసన మండలి రద్దు ప్రస్తావన మళ్ళీ రాలేదు.

 కాగా తాజాగా వస్తున్న వార్తల ప్రకారం శాసనమండలి రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఏకగ్రీవం చేసుకుంది. గవర్నర్ కోటాలో సైతం ఇద్దరు ఎమ్మెల్సీలు ఎంపికయ్యారు. దీనిని బట్టి ప్రభుత్వం శాసన మండలి రద్దుకు అనుకూలంగా లేదని తెలుస్తోంది. కొంత ఆలస్యమైనా శాసనమండలిలో మెజార్టీ పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది జూన్ లేదా ఏప్రిల్ నెలకల్లా మండలిలో అధికార పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అప్పటి వరకు ఎదురు చూడాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News