తెలుగు రాష్ట్రాలు అంత అప్పు తెచ్చేందుకు కేంద్రం ఓకే

Update: 2020-09-25 07:15 GMT
కరోనా కానీ భారీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం వాస్తవం. దీన్ని అధిగమించేందుకు వీలుగా వీలైనంతగా రుణాల్ని తీసుకురావటం ఈ మధ్యన ఎక్కువైంది. అయితే.. రుణాలు తెచ్చుకోవాలంటే రాష్ట్రాలు అనుకుంటే సరిపోదు. దానికుండే లెక్కలు దానికి ఉన్నాయి. కేంద్రం అనుమతి తప్పనిసరి.

రుణాల అనుమతి కోసం అడిగినంతనే కేంద్రం ఓకే చెప్పేయదు. దాని వరకు కొన్ని లెక్కలు ఉన్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. మరికొన్ని రాష్ట్రాలకు ఊరట కలిగించేలా కేంద్రం ఒక నిర్ణయాన్ని వెల్లడించింది. తాము చెప్పినట్లుగా ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డును షరతును అమలు చేసినందుకు బహిరంగ మార్కెట్ నుంచి అదనపు రుణాలు సేకరించుకోవటానికి వీలుగా కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిని ఇచ్చింది.

దీంతో.. తెలంగాణ రాష్ట్రానికి రూ.2508 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ కు రూ.2525 కోట్లు అదనపు రుణాలు తీసుకోవటానికి ఓకే చెప్పింది. ఈ రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక రాష్ట్రానికి రూ.4509 కోట్లు.. గోవా రూ.203కోట్లు.. త్రిపుర రూ.148 కోట్లు అదనపు రుణాలు తెచ్చుకోవటానికి వీలుగా ఓకే చెప్పేసింది.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్ల నుంచి జీఎస్ డీపీలో 3 శాతం మేరరుణాలు తీసుకోవటానికి ఉన్న పరిమితిని 5 శాతం వరకు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. అదనపు రుణాలు సమకూర్చుకోవటానికి కేంద్రం ఓకే అనటం రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతో ఇంతో ఊరటనిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News