బెయిల్ ఇవ్వటానికి మీరెప్పుడు వినని కండీషన్ పెట్టిన కోర్టు

Update: 2020-11-06 03:45 GMT
ఏదైనా నేరారోపణ చేసిన వేళలో కేసు నమోదు కావటం.. పోలీసులు అరెస్టు చేయటం లాంటివి తెలిసిన విషయాలే. అరెస్టు నుంచి బయటపడేందుకు కోర్టును బెయిల్ కోరటం సాధారణంగా జరిగేదే. బెయిల్ ఇచ్చేందుకు బాండ్ తో పాటు కొన్ని కండీషన్లు పెడుతుంటాయి న్యాయస్థానాలు. ఇంతకు ముందెప్పుడూ వినని రీతిలో షరతు పెట్టిన అలహాబాద్ హైకోర్టు ఉదంతం ఊహించని రీతిగా ఉండటం విశేషం.

ఇంతకూ ఈ వ్యక్తి చేసిన తప్పేమిటి? అన్నది చూస్తే.. యూపీకి చెందిన అఖిలానంద్ రావు అనే వ్యక్తి ఈ ఏడాది మే 12న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో.. అతనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అరెస్టు చేశారు. దీంతో.. అతగాడు బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు అతడు తప్పుడు స్టేటస్ లు పెట్టే అలవాటు ఉందని.. అతనిపై ఇప్పటికే 11 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇరు వర్గాల లాయర్ల వాదనలు అనంతరం అలహాబాద్ హైకోర్టు ఇంతకు ముందెప్పుడు వినని రీతిలో షరతు పెడుతూ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కావాలంటే.. సదరు నిందితుడు రెండేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఒకవేళ.. సోషల్ మీడియాలో పోస్టు పెడితే మాత్రం.. తక్షణం అతగాడి బెయిల్ రద్దు అవుతుందని స్పష్టం చేసింది. కనీసం రెండేళ్ల వరకుకానీ.. ట్రయల్ కోర్టులో కేసు తీర్పు వచ్చే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. బెయిల్ కోసం కోర్టు పెట్టిన షరతు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News