చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంతగా.. భ్ర‌ష్టు ప‌డుతున్న ఎన్నిక‌ల సంఘం!

Update: 2023-02-21 13:00 GMT
భార‌త ఎన్నిక‌ల సంఘం. అంటే.. ఇదేమీ ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ కాదు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌. ఏ ప్ర‌ధాని చేతికిందో.. ఏ ముఖ్య‌మంత్రి చేతికిందో.. ఏ కేంద్ర పెద్ద‌ల చేతికిందో ప‌నిచేయాల్సిన వ్య‌వ‌స్థ అంత‌క‌న్నా కాదు. భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 324 ప్రకారం.. ఏర్పడిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం .. సంపూర్ణంగా స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ‌. అంటే.. అటాన‌మ‌స్ బాడీ. ఇది కేవ‌లం రాష్ట్ర‌ప‌తికి, సుప్రీంకోర్టుకు మాత్ర‌మే జ‌వాబుదారీ. మ‌రి అలాంటి వ్య‌వ‌స్థ నేడు ఎందుకు దిగ‌జారింది?  అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఒక‌ప్పుడుకేర‌ళ‌కు చెందిన టీఎన్ శేష‌న్ కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మయంలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు ఆయ‌న జీవం పోశారు. ప్ర‌స్తుతం మ‌నం ఉప‌యోగిస్తున్న ఓట‌రు కార్డు కానీ,  ఎన్నిక‌ల పోలింగ్ రోజుకు 48 గంటల ముందుగా.. ప్ర‌చారాన్ని నిలివేసే ప‌రిస్థితి కానీ, వాహ‌నాలు పెట్టి.. ఓట‌ర్ల‌ను త‌ర‌లించ‌రాద‌న్న‌.. నియ‌మం కానీ, ఇళ్ల కు ఉన్న గోడ‌ల‌పై పార్టీ ఎన్నిక‌ల గుర్తుల‌తో పెయింట్ వేసి.. ప్ర‌చారం చేయ‌రాద‌న్న కీల‌క ఆదేశం కానీ.. ఇవ‌న్నీ శేష‌న్ ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాలే.

వీటిపై అప్పట్లో పెద్ద ఎత్తున రాద్ధాంత‌మే జ‌రిగింది. అయితే.. త‌న‌కు ఉన్న రాజ్యాంగ విశేష అధికారాల‌ను ప్ర‌యోగించిన శేష‌న్‌.. వాటిని అమ‌లు చేసి తీరాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. అందుకే.. శేష‌న్ వంటివారిని పార్టీలు జీర్ణించుకోలేక పోయాయి. రాష్ట్ర‌ప‌తిగా పోటీ చేస్తే.. క‌నీసం ప‌ట్టుమ‌ని ప‌ది ఓట్లు కూడా రాల‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌ట్ చేస్తే.. ఇప్ప‌డు శేష‌న్‌లు లేరు. పోతేపోనీ.. పోనీ.. ఆయ‌న ఏర్పాటు చేసిన ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ను కూడా కాపాడే ప‌రిస్థితి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గ‌త డిసెంబ‌రులో గుజ‌రాత్ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ప్ర‌ధాని మోదీ వెళ్లి ఓటు వేశారు. అయితే.. ఈ స‌మ‌యంలో చోటు చేసుకున్న హైడ్రామా అంతా ఇంతా కాదు. కిలో మీట‌రు దూరం.. పాద‌యాత్ర చేసుకుంటూ.. మోడీ వెళ్ల‌డం..మీడియా ఆయ‌న‌ను అనుస‌రించి లైవ్ ఇవ్వ‌డం.. ఓటు వేసిన త‌ర్వాత‌.. రెండు కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్తూ.. చేతులు ఊపడం.. న‌వ్వ‌డం.. వంటివి ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌దా? అంటే.. ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికీ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి!!

ఇక‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని తోసిరాజ‌ని.. బీజేపీ ప‌ఠించిన జంపింగ్ మంత్రంతో 22 మంది కాంగ్రెస్ నేత‌ల‌ను అక్కున చేర్చుకుని క‌మ‌లం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు.. ఇది న్యాయ‌మా? అని ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌శ్నిస్తే.. మౌన‌మే స‌మాధానం అయింది. ఇక‌, మ‌హారాష్ట్ర విష‌యంలో శివ‌సేన గుర్తు, పార్టీ జెండా అజెండాల‌ను గుండుగుత్త‌గా.. ఏక్‌నాథ్ షిండే వ‌ర్గానికి కేటాయించేయ‌డం.. ఎన్నిక‌ల సంఘం ఎంత భ్ర‌ష్టుప‌ట్టిందో చెప్ప‌డానికి మేలిమి ఉదాహ‌ర‌ణ‌ల‌ని ప్ర‌జాస్వామ్య వాదులు అంటున్నారు.

దీనిపై సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ జ‌రగాల్సి ఉంది. మంగ‌ళ‌వారం జ‌రుగుతుంది కూడా. కానీ ఇంత‌లోనే ఎన్నిక‌ల‌సంఘం తీసుకున్న నిర్ణ‌యం ఎవ‌రిని మెప్పించేందుకు?  అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఎన్నిక‌ల సంఘం.. పేరు.. ఉన్న‌తి.. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News