తరం మారింది.. వన్డేలకు కాలం చెల్లిందా..? కుదించి ఆడించాలా..?

Update: 2022-07-27 00:30 GMT
కాలం మారింది.. ఆధునిక క్రికెట్ లో మూడు ఫార్మాట్లకు చోటు దక్కింది.. అయితే, వీటిలో సంప్రదాయ ఆటకు పెట్టింది పేరైన టెస్టుల మనుగడకు ముప్పేమీ లేదు. ఆ ఫార్మాట్ లోని సౌకర్యం, సొగసే దానిని కాపాడుతోంది. ఎంత గొప్ప క్రికెటర్లయినా.. టెస్టు క్రికెట్ ఆడడం తమ కల అని చెబుతుంటారు. అసలు టెస్టులు ఆడని వారిని, ఆ ఫార్మాట్ లో రాణించనివారిని పరిపూర్ణ క్రికెటర్ గానే గుర్తించరు. ఇక టి20ల విషయానికొస్తే.. ప్రస్తుత తరానికి తగిన ఫార్మాట్ ఇది. వేగం, వైవిధ్యం కలగలసిన ఈ ఫార్మాట్ కొందరు ఆటగాళ్లకు కలిసొచ్చింది. చాలామందిని వెలుగులోకి తెచ్చింది కూడా. ఎటొచ్చీ.. వన్డే క్రికెట్ భవితవ్యంపైనే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. టి20ల రాకతోనే వన్డేలు ఆడడం తగ్గింది. అసలు టి20లు ప్రారంభమైన మొదటి ఐదారేళ్లలోనే వన్డేలు ఇక అవసరమా..? అనే చర్చ వచ్చింది. దీనికి చెక్ పెడుతూ వన్డేలు 15 ఏళ్లుగా మనగలుగుతున్నాయి. అయితే, ఇటీవల వన్డే క్రికెట్ ఆకర్షణ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలు ఉంటే తప్ప వన్డేలు ప్రజలను ఆకర్షించడం లేదు.

చిత్రంగా పుట్టి.. 51 ఏళ్లు.. దగ్గర దగ్గర 5 వేలు..

టెస్టులు మకుటం లేని మహరాజులా కాలం ఏలుతున్న సమయంలో వన్డేలు మొదలయ్యాయి. 1971 జనవరి 5న తొల వన్డే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్ బోర్న్ లో జరిగింది. అయితే, వన్డేల పుట్టుక కూడా చిత్రంగా జరిగింది. ఆసీస్, విండీస్ మధ్య మూడో టెస్టు వర్షం కారణంగా రద్దు అయింది. దాని స్థానంలో ఓవర్ కు ఎనిమిది బంతుల చొప్పున 40 ఓవర్ల మ్యాచ్ ను నిర్వహించారు. అలాఅలా.. ఇప్పటివరకు 4438 వన్డేలు జరిగాయి. అంటే.. మరికొన్నేళ్లలో వన్డేలు 5 వేల మార్క్ నకు చేరనున్నాయి. కానీ, ప్రస్తుతం వన్డేలు అవసరమా? అంటూ చాలా పెద్ద చర్చ జరుగుతోంది.

స్టోక్స్ రిటైర్మెంట్ తో..

ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ వన్డే కెరీర్‌కు వీడ్కోలు చెప్పినప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్‌ మనుగడపై మాటలు పెరుగుతున్నాయి. అది కూడా 2019 వన్డే ప్రపంచ కప్ ను ఇంగ్లండ్ గెలవడంలో అత్యంత కీలకంగా నిలిచిన స్టోక్స్ రిటైర్మెంట్ అందరినీ ఆశ్చర్యపర్చింది. మరికొన్నాళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉన్న అతడు టెస్టులు, టి20ల్లో కొనసాగుతూ వన్డేలకు వీడ్కోలు చెప్పడం గమనార్హం.శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు స్టోక్స్‌ తెలిపాడు. అప్పటి నుంచి వన్డేల భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది.  స్టోక్స్ ఇలా తప్పుకొన్నాడో లేదో.. ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వన్డే క్రికెట్ భవితవ్యం సంగతిని ప్రశ్నించాడు. తదనంతరం వన్డేలకు కళ తగ్గుతోందని, అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌ నుంచి నెమ్మదిగా తొలగించాలని వసీమ్‌ అక్రమ్‌ లాంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్ర్రి కూడా దీనిపై స్పందించాడు. వన్డే మ్యాచ్‌లను 40 ఓవర్లకు కుదిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిదీ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. దానిని రవి శాస్త్రి సమర్థించాడు. మ్యాచ్‌ వ్యవధిని తగ్గించడం వల్ల వన్డేలకు ఎలాంటి హానీ ఉండదన్నారు.

60 నుంచి 50కు .. ఇక 40

వన్డే క్రికెట్‌ ప్రారంభంలో ఒక్కో ఇన్నింగ్స్ 60 ఓవర్లు ఉండేది. తొలి మూడు ప్రపంచ కప్ లు ఇదే పద్ధతిన జరిగాయి. 1983లో భారత్ గెలిచిన సమయంలోనూ అంతే. అయితే, 60 ఓవర్లు చాలా ఎక్కువ సమయం అని 50కు తగ్గించారు. అంటే.. 35 ఏళ్లుగా 50 ఓవర్లతో వన్డేలు ఆడుతున్నారు. సుదీర్ఘకాలంగా ఇదే ఫార్మాట్‌లో వన్డేలు కొనసాగుతున్నందున ఇప్పుడు దీన్ని ఎందుకు మార్చకూడదు? అనే ప్రశ్న వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఓవర్లు చాలా ఎక్కువేనని.. ముందుచూపుతో, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి అంటున్నాడు.

అన్ని ఫార్మాట్లు ఆడుతున్నదెవరు?

వన్డేల నిడివి తగ్గింపు విషయానికొస్తే.. టి20లతో పోల్చి చూసినప్పడు ఓవర్లు తగ్గించాలి అనే అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ధనాధన్ క్రికెట్ అయిన టి20లకు అలవాటు పడిన వారు వన్డేలను చూసేందుకు ఇష్టపడడం లేదు. ముఖ్యంగా ఈ తరం వారికి వన్డేలు అలవాటు కాలేదు. ప్రస్తుతం 20 ఏళ్ల వయసు వారంతా టి20ల మజాలో పుట్టి పెరిగినవారే. అందుకనే వారికి వన్డే క్రికెట్ మజా మెదడుకు ఎక్కడం లేదు. అయితే ఆటగాళ్ల కోణంలో చూస్తే స్టోక్స్ చెబుతున్నట్లు అలసటే కారణమా? లేక టి20 లీగ్ ల నుంచి వచ్చి పడుతున్న పెద్ద మొత్తం డబ్బా? అనేది తేలాలి. వాస్తవానికి ప్రపంచ క్రికెట్ లో మూడు ఫార్మాట్లు ఆడుతున్న క్రికెటర్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అయినప్పటికీ, వన్డేలను అందరూ కాక కొందరే భారంగా భావిస్తున్నారు.

మార్పు మంచిదే..

వన్డేలు 50 ఓవర్ల ఫార్మాట్ కు మారి నాలుగు దశాబ్దాలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో మార్పు మంచిదే. 40 ఓవర్లకు కుదించాలన్న ప్రతిపాదన కూడా పరిశీలించదగినదే.  టీ20 ఫార్మాట్‌కు పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పెరుగుతోన్న వేళ 50 ఓవర్ల పాటు ఆడాలని ఏ ఆటగాడూ కోరుకోవడం లేదని మాజీలు చెబుతున్నారు. అందువల్ల వాటిని క్రమక్రమంగా తగ్గిస్తూ
పూర్తిగా రద్దు చేయాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొసమెరుపు..: వన్డే క్రికెట్ భవితవ్యంపై అనేక ప్రశ్నలు రేగుతున్న వేళ.. భారత్- విండీస్ మధ్య జరిగిన రెండు వన్డేల ఫలితాలు అందరినీ ఉత్కంఠకు గురిచేశాయి. రెండు మ్యాచ్ ల్లోనూ రెండు జట్లూ 300 పైగా పరుగులు చేయడం.. వాటి ఛేదన చివరి ఓవర్ వరకు సాగడం.. వన్డేలపై ఇంకా ఆశలు నిలిపింది.
Tags:    

Similar News