గౌతు ఫ్యామిలీ క‌థ ముగిసిందా? క‌నిపించ‌ని హ‌వా

Update: 2020-12-14 02:30 GMT
ఉత్త‌రాంధ్ర‌లో ఉద్య‌మాల‌కు పురుటిగ‌డ్డ‌గా పేర్కొనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌతు ల‌చ్చ‌న్న కుటుంబం గురించి తెలుగు నేల‌పై తెలియ‌ని వారు ఉండ‌రు. అనేక రైతాంగ ఉద్య‌మాలు.. స్థానిక స‌మ‌స్య‌ల‌పై ఎలుగె త్తిన ల‌చ్చ‌న్న కుటుంబం నుంచి రాజ‌కీయ రంగంలోకి వ‌చ్చిన గౌతు శ్యామ్‌సుంద‌ర్ శివాజీ.. శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లుమార్లు విజ‌యం సాధించారు. 2014లో టీడీపీ త‌ర‌ఫున ప‌లాస నుంచి విజ‌యం సాధించిన శివాజీ దూకుడుగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఈ కుటుంబం నుంచి ఆయ‌న కుమార్తె శిరీష కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌గా, జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా కూడా ఆమె వ్య‌వ‌హ‌రించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ప‌లాస టికెట్‌ను పొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు కోసం.. విశ్వ ప్ర‌య‌త్నం చేశారు. కొన్నిరోజులు తండ్రి ఫొటోను వాడుకున్నారు. మ‌రికొన్నాళ్లు తాత ల‌చ్చ‌న్న పొటోను కూడా వాడుకున్నారు. శ్రీకాకుళం ప్ర‌జ‌లు ల‌చ్చ‌న్న‌కు రుణ‌ప‌డ్డార‌ని.. ఆయ‌న మ‌న‌వ‌రాలిగా త‌న‌ను గెలిపించి రుణం తీర్చుకోవాల‌ని కూడా కామెంట్లు చేశారు. అయితే.. ఆమెను ప్ర‌జ‌లు గెలిపించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ప్ర‌చారం చేసినా.. శిరీష గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు.

స‌రే! ఎన్నిక‌ల్లో గెలుపు, ఓట‌ముల‌తోనే ఒక నేత రాజ‌కీయ భ‌విత‌వ్యాన్నినిర్ణ‌యించ‌లేం. కానీ.. త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. గౌతు ఫ్యామిలీ రాజ‌కీయాలు ఇక ముగిసిన‌ట్టేన‌ని టీడీపీలోనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. శివాజీ దూకుడు. సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయ‌న గ‌తంలో ఆరోప‌ణ‌లు చేశారు. వివాదాల‌తో రోడ్డెక్కారు. ఇది గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట్లు చీలిపోవ‌డానికి కార‌ణ‌మైంది. ఇక‌, త‌ర్వాతైనా.. ఈ కుటుంబం రాజ‌కీయాలు మార‌లేదు. ఈ ఫ‌లితంగానే పార్టీ ప‌ద‌వుల్లోనూ గౌతు కుటుంబానికి ప్రాధాన్యం ల‌భించ‌లేదు. ఇక‌, పార్టీ త‌ర‌ఫున కూడా వాయిస్ వినిపించ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. గౌతు కుటుంబం రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్టేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News