బీజేపీని ఎదుర్కొనేది కొత్త జాతీయ పార్టీనే.. కేసీఆర్

Update: 2022-03-22 10:35 GMT
జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచనప్రాయంగా వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత ఉందని, దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. “ఈ శూన్యతను పూరించడానికి.. జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి బలమైన ప్రత్యామ్మాయం అవసరం.

అందుకే జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నాను. 2024 నాటికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవిస్తుందని నేను బలంగా భావిస్తున్నాను' అని ఆయన అన్నారు.

కేసీఆర్ స్వయంగా కొత్త జాతీయ పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారా లేక ప్రస్తుతం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయాలుగా ఆవిర్భవిస్తున్నాయని అంచనా వేస్తున్నారా అనేది ఖచ్చితంగా తెలియదు.‘‘దేశ ప్రజలు బీజేపీ పట్ల పూర్తిగా అసహ్యంతో ఉన్నారు.

ప్రత్యామ్నాయం ఉంటే దానికి ఓటు వేస్తారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీని జాతీయ రాజకీయాల నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.‘ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"కశ్మీర్ ఫైల్స్" సినిమాపై రాజకీయాలు చేయడానికి ప్రయత్నించినందుకు, ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజిస్తున్న బిజెపిని కూడా కేసిఆర్ తప్పుబట్టారు. ‘‘ఈ సినిమా కేవలం కీలకమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే. బీజేపీ పాలిత రాష్ట్రాలు హిందువుల సెంటిమెంట్లను క్యాష్ చేసుకునేందుకే ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చాయి'' అని కేసీఆర్ ఆరోపించారు..

కాశ్మీరీ పండితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇలా సినిమాలను ప్రోత్సహించడం  కాకుండా ఏదైనా వారి సంక్షేమం కోసం చేయాలని కేసీఆర్ అన్నారు. “దేశానికి ఇప్పుడు కావలసింది కాశ్మీర్ ఫైల్స్ కాదు. జీడీపీ ఫైల్స్, అగ్రికల్చర్ ఫైల్స్, ట్రైబల్ ఫైళ్లు, ఎకనామిక్ ఫైల్స్, రైతుల ఫైళ్లు, డెవలప్‌మెంట్ ఫైల్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది‘‘ అని అన్నారు.
Tags:    

Similar News