విడాకుల్లో కొత్త తీర్పుః భ‌ర‌ణమే కాదు.. ఆమె సేవల‌‌కు వేత‌న‌మూ ఇవ్వాల‌ట‌!

Update: 2021-02-25 03:30 GMT
భార్యాభ‌ర్త‌లు విడాకులు తీసుకుంటే.. భ‌ర‌ణం చెల్లించ‌డం వ‌ర‌కూ మ‌న‌కు తెలుసు. కానీ.. చైనాలో భ‌ర‌ణంతో పాటు ఇప్పుడు మ‌రో విధ‌మైన చెల్లింపులు కూడా చేయాల‌ట‌. భార్య అప్ప‌టి వ‌ర‌కూ చేసిన సేవ‌కు లెక్క గ‌ట్టి మ‌రీ వేత‌నం రూపంలో చెల్లించాల‌ట‌. అప్పుడు మాత్ర‌మే పెళ్లి ర‌ద్దుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భిస్తుంద‌ట‌. ఈ మేర‌కు చైనాలోని ఓ కోర్టు వెల్ల‌డించిన తీర్పు.. ఆ దేశంలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.

ఓ దంప‌తుల కేసులో..
చైనా దేశానికి చెందిన చెన్‌-వాంగ్ అనే దంపతులకు ఐదేళ్ల కింద‌ట వివాహం అయ్యింది. ప‌లు కార‌ణాల‌తో వారిద్ద‌రూ కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. కోర్టు కూడా వారిద్ద‌రికీ విడాకులు మంజూరు చేసింది. ఆ సమయంలో భర్త నుంచి భరణం ఇప్పించింది. అయితే.. ఆ దేశంలో ఈ నెల 4 నుంచి కొత్త సివిల్ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం.. దంప‌తులు క‌లిసి ఉన్న‌న్ని రోజులు ఇంట్లో భార్య‌లు ఎక్కువ ప‌నిచేస్తే అందుకోసం వారు స్పెష‌ల్ పరిహారం కోరవచ్చు. ఇది.. భరణానికి అదనం.

ఈ చ‌ట్టాన్ని కార‌ణంగా చూపుతూ.. చెన్‌-వాంగ్ దంప‌తుల్లోని మ‌హిళ వాంగ్ త‌న‌కు ప‌రిహారం ఇప్పించాల‌ని మ‌ళ్లీ కోర్టుకు ఎక్కింది. తాము క‌లిసి ఉన్న‌ ఐదేళ్లలో ఇంటి పని, పిల్లల బాగోగులు అన్ని తానే చూసుకున్నానని, భ‌ర్త ఆఫీస్ ప‌నులు మాత్రమే చూసుకునేవాడ‌ని చెప్పింది. రోజంతా పిల్లలు, ఇంటి పనితో సరిపోయేదని, కాబ‌ట్టి త‌న‌కు కొత్త చ‌ట్టం ప్ర‌కారం పరిహారం ఇప్పించాలని కోరింది. వాంగ్‌ వాదనలను స‌మ‌ర్థించిన‌ బీజింగ్ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

ఐదు సంవ‌త్స‌రాల‌కు గానూ.. 7,700 డాలర్లు చెల్లించాల్సిందిగా తీర్పు వెల్లడించింది. అయితే.. వాంగ్ కు అనుకూలంగా తీర్పు చెప్పిన‌ప్ప‌టికీ.. ఐదేళ్ల కాలానికి మ‌రీ అంత త‌క్కువ‌గా చెల్లిస్తారా? మ‌హిళ‌ల సేవ మ‌రీ అంత చుల‌క‌నా అంటూ ఫైర్ అవుతున్నారు చైనావాసులు. ఈ తీర్పుపై చైనీస్‌ ట్విట్టర్ ‘వీబో’లో తీవ్ర చర్చ నడుస్తోంది. అంతేకాదు.. పెళ్లి చేసుకున్న వారు, చేసుకోబోయే వారు ఎవరూ హౌస్ వైఫ్ గా ఉండొద్దని ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు విడాకులు పొందాలనుకుంటే.. ఇంటి పని చేస్తున్నందుకు 50 వేల యువాన్లకు మించి రావని అంటున్నారు.

కాగా.. ఈ తీర్పుపై ఓ న్యాయమూర్తి మాట్లాడుతూ.. వారు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు..? భ‌ర్త ఆదాయం ఎంత‌? వాంగ్ ఇంటి పని ఎంత‌? స్థానిక జీవన వ్యయం ఎలా ఉంది? అనే అన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే ఆ మొత్తం ఇవ్వాల‌ని తీర్పు చెప్పిన‌ట్టు ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News