కాంగ్రెస్ ముసలి బ్యాచ్ మళ్లీ అలక..!

Update: 2021-02-28 06:03 GMT
దేశంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారానికి దూర‌మైంది. మ‌ళ్లీ తిరిగి లేవొద్దు అన్న‌ట్టుగా తొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తోంది బీజేపీ. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘సీనియర్‌’ అనే బోర్డు మెళ్లో వేసుకున్న నేతలు ఏం చేయాలి..? అందునా.. 80ఏళ్ల దగ్గరపడిన నాయకులు ఎలాంటి పాత్ర పోషించాలి..? యువతరాన్ని ముందు పెట్టి.. తమ అనుభవాన్ని ఉపయోగించి పార్టీలో జవసత్వాలు నింపేందుకు కృషిచేయాలి. కానీ.. హ‌స్తం పార్టీలో ముస‌లి బ్యాచ్ తీరు చూస్తుంటే.. విస్మ‌యం క‌లుగుతోంది. స‌రిగ్గా ఎన్నిక‌ల వేళ అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తుండ‌డంతో అనేక అనుమానాలు కూడా త‌లెత్తుతున్నాయి!

5 రాష్ట్రాల్లో ఎన్నిక‌ల న‌గారా..

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఐదురాష్ట్రాల ఎన్నికలకు న‌గారా మోగించింది. ఈ మేర‌కు షెడ్యూల్ రిలీజ్ చేసింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, అసోం, వెస్ట్ బెంగాల్‌. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పోటీలో లేదు అని, అంతా త‌మ‌దే హ‌వా అని ప్ర‌చారం చేసుకుంటోంది బీజేపీ. తమిళ‌నాడులో అన్నాడీఎంకేతో క‌లిసి పాగా వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. బెంగాల్లో మ‌మ‌తతో నువ్వా? నేనా? అన్న‌ట్టుగా పోరాటం చేస్తోంది. అసోంలో మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని క‌మ‌ల‌ద‌ళం ప‌ట్టుద‌ల‌గా ఉంది. కేర‌ళ‌, పుదుచ్చెరిలోనూ స‌త్తా చాటుతామంటోంది.

ముస‌లి బ్యాచ్‌ సిల్లీ గొడవ..

ప్ర‌త్య‌ర్థి, అందునా అధికారంలో ఉన్న పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో దూసుకుపోతుంటే.. ధీటుగా రంగంలోకి దూకాల్సిన కాంగ్రెస్ అంత‌ర్గ‌త పోరుతో ర‌చ్చ‌కెక్కుతోంది! ఇలాంటి స‌మ‌యంలో త‌మ అనుభ‌వాన్ని రంగ‌రించి, పార్టీని గ‌ట్టెక్కించాల్సిన ముస‌లి బ్యాచ్.. అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తోంది. గ‌తంలో జీ-23 పేరుతో గ్రూపుగా ఏర్ప‌డిన కాంగ్రెస్ ముస‌లి బ్యాచ్ మొత్తం.. మ‌ళ్లీ హైక‌మాండ్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం విశేషం. ‘శాంతి సమ్మేళన్’ పేరుతో స‌మావేశం నిర్వహించి, కాంగ్రెస్ ను స‌మూళంగా ప్ర‌క్షాళ‌న చేయాలంటూ డిమాండ్ చేయ‌డం విశేషం.

ఈ స‌మ‌యంలో చేయాల్సిందేంటీ?

ఎన్నిభేదాభిప్రాయాలున్నా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రం ఒకేట‌న‌ని క‌దా ముందుకు సాగాల్సింది? అప్పుడే క‌దా.. కేడ‌ర్ జోష్ గా ముందుకు క‌దిలేది? ఈ జోరు కొన‌సాగిస్తేనే క‌దా.. జ‌నాల్ని ఆక‌ర్షించేది? అప్పుడే క‌దా.. అధికారం హ‌స్తగ‌తం అయ్యేదీ? ఇలాంటి.. కీల‌క స‌మ‌యంలో ఏక‌తాటిపైకి రావ‌డం వ‌దిలేసి.. అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తోంది కాంగ్రెస్‌లోని ముస‌లి బ్యాచ్‌.

పేరుకే సీనియ‌ర్లు..

జీ-23 బ్యాచ్ లో క‌నిపిస్తున్న ముస‌లి బ్యాచ్ లో దాదాపు స‌గం మంది 80 సంవ‌త్స‌రాలు క్రాస్ చేసిన వారు, మిగిలిన వారు ద‌గ్గ‌ర‌లో ఉన్నారు. ‘శాంతి స‌మ్మేళ‌న్‌’ సమావేశంలో సీనియర్లు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, భూపేందర్ సింగ్, రాజ్ బబ్బర్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ల‌కు క్షేత్ర‌స్థాయిలో పెద్ద బ‌లం లేదు. పార్టీకి కొత్త త‌రాన్ని అందించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌రు. యువ‌త‌ను ముందుకు తెస్తే.. ఎక్క‌డ త‌మ బిల్డ‌ప్ కు అవ‌కాశం ఉండదేమోన‌ని, ఎవ్వ‌రినీ ఎద‌గ‌నీయ‌రు. ఇక‌, కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ గెలుపున‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల్సిందిపోయి.. హైక‌మాండ్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇదంతా కావాల‌ని చేస్తున్నారా..?

ఈ బ్యాచ్ లో ఉన్న‌వారంతా త‌ల‌పండిన వారు. ఏ స‌మ‌యంలో ఎలాంటి మాట మాట్లాడితే.. ఏం జ‌రుగుతుందో అంచ‌నా వేయ‌గ‌లిగిన‌వారే. మ‌రి, కీల‌క‌మైన‌ ఈ ఎన్నికల‌ స‌మ‌యంలో ఇలా పార్టీ అధిష్టానంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారంటే.. అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. వీరు కాంగ్రెస్ కోస‌మే ప‌నిచేస్తున్నారా? లేదా.. కాంగ్రెస్ లో ఉంటూ.. ప్ర‌త్య‌ర్థుల కోసం ప‌నిచేస్తున్నారా? అని ఆ పార్టీ కేడ‌రే మండిప‌డుతోంది. పార్టీకి అండ‌గా నిల‌వాల్సిన స‌మ‌యంలో ఇలా చేయ‌డం వ‌ల్ల న‌ష్ట‌మేన‌ని తెలిసి కూడా చేస్తున్నారంటే.. ఇదంతా ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌త్య‌ర్థుల‌కు లాభం చేయ‌డానికే అన్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి.. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ముస‌లి బ్యాచ్చే.. భ‌స్మాసుర హ‌స్తంగా మారిపోయింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News