హనీట్రాప్ లో ఆ దేశ ప్రధాని.. భారత్ కు వ్యతిరేకం అందుకేనా?

Update: 2020-07-12 12:50 GMT
సుదీర్ఘకాలం భారత్ కు మిత్రదేశంగా ఉన్న నేపాల్.. ఇప్పుడు అందుకు భిన్నంగా చైనా చెప్పినట్లు ఆడుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైనం విస్మయానికి గురి చేసింది. భారత్ తో కయ్యానికి కాలు దిగినందుకు ప్రధాని సీటు కిందకు నీళ్లు వచ్చినా.. మొండితనాన్ని ప్రదర్శిస్తున్న వైనంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నట్లు? అన్న ప్రశ్నకు షాకింగ్ సమాధానం బయటకు వచ్చింది.

భారత్ సరిహద్దుల వద్ద రచ్చకు కారణం చైనా పన్నిన హనీ ట్రాప్ గా చెబుతున్నారు. నేపాల్ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి.. చైనా రాయబార కార్యాలయానికి చెందిన మహిళా ప్రతినిధి హౌ యాంకీ పన్నిన హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో.. ఆమె చెప్పినట్లుగా ఆయన ఆడుతున్నారని చెబుతున్నారు. భారత్ కు వ్యతిరేకంగా సరిహద్దుల వద్ద నేపాల్ సైన్యాన్ని మొహరించటంతో పాటు.. భారత్ కు చెందిన పలు ప్రాంతాల్ని తమవిగా పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదంతా సరిపోనట్లు కోవిడ్ నియంత్రణలో నేపాల్ ప్రధాని దారుణంగా ఫెయిల్ అయినట్లుగా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆ దేశ యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నియంత్రణకు ఇప్పటికే ఓలీ సర్కారు 10 బిలియన్ నేపాలీ రూపాయిల్ని ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. మరి.. అంత ఖర్చు లెక్క ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం రాని పరిస్థితి.

నేపాల్ తీరుతో ఆగ్రహంగా ఉన్న భారత్.. ఆ దేశంతో ఉన్న తన సరిహద్దుల్ని మూసేసింది. దీంతో మన దేశం నుంచి సరకు రవాణా ఆగిపోయింది. ఈ కారణంగా నేపాల్ లో నిత్యవసరాలు..కూరగాయల ధరలు 100 నుంచి 200 శాతం పెరిగాయట. ఇప్పటికే దేశంలో పలు సమస్యలు ఉన్న వేళలో.. చైనా ఆడించినట్లు ఆడి.. భారత్ తో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటంపై అధికార పార్టీలోని బలమైన వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారత్ కు మొదట్నించి మిత్రదేశంగా ఉన్న నేపాల్.. ఓలీ చేసిన పని కారణంగా శత్రు దేశంగా మారినట్లుగా నేపాలీలు భావిస్తున్నారు. తమ సంగతి తాము చూసుకోకుండా భారత్ ను కెలికిన నేపాల్ సర్కారు అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.
Tags:    

Similar News